TPT TEMPLE COMMITTEES: ఆంధ్రప్రదేశ్‌లోని చిన్న దేవాలయాలకు కమిటీల నియామకం కోసం సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని ప్రసిద్ధ బోయకొండ గంగమ్మ దేవస్థానం చైర్మన్ పదవి కోసం తీవ్ర పోటీ నడుస్తోంది. టీడీపీ పార్టీ కష్టకాలంలో అండగా నిలిచిన నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలనే సీఎం నిర్ణయం, ఈ పదవి రేసులో ఉన్న ఆశావాహుల మధ్య ఆసక్తికర చర్చలకు దారితీస్తోంది. ఇంతకీ బోయకొండ గంగమ్మ దేవస్థానం చైర్మన్ రేసులో ఎవరెవరున్నారు? ఈ స్టోరీలో చూద్దాం.
రాష్ట్రవ్యాప్తంగా త్వరలో చిన్న దేవాలయాలకు కమిటీలను నియమించాలని సీఎం చంద్రబాబు నాయుడు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో ఉన్న ప్రముఖ బోయకొండ గంగమ్మ దేవస్థానం కమిటీ చైర్మన్ రేసులో చాలామంది ఆశావాహులు పోటీపడుతున్నారు. అయితే, సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం కష్టకాలంలో పార్టీకిఅండదండగా నిలిచిన వ్యక్తులకు బోయకొండ గంగమ్మ దేవస్థానం చైర్మన్ పదవి అప్పచెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, గత ఎన్నికల్లో టీడీపీ పార్టీ కోసం, పుంగనూరు అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి కోసం కష్టపడి పనిచేసిన చౌడేపల్లి మండలం ఎర్రగంగన్నపల్లికి చెందిన లక్ష్మీపతి రాజు అలియాస్ పతిరాజు రేసులో మొదటి వరుసలో ఉన్నారు. లక్ష్మీపతి రాజు 2024 ఎన్నికల్లో తన సొంత నిధులతో టీడీపీ గెలుపు కోసం, అదేవిధంగా అభ్యర్థి చల్లా బాబు గెలుపు కోసం తీవ్రంగా శ్రమించి, కష్టపడ్డారని పార్టీ హైకమాండ్ గుర్తించింది.
రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, మొదటిసారిగా టీటీడీ పాలకమండలి సభ్యుడు పదవి ఆశించిన లక్ష్మీపతి రాజు, మొదటి లిస్టులో అవకాశం దక్కకపోవడంతో, ప్రస్తుతం బోయకొండ గంగమ్మ చైర్మన్ పోస్టును ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. తన సొంత నిధుల ద్వారా పుంగనూరు నియోజకవర్గంలో అనేక మందికి సామూహిక కల్యాణాలు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన ట్రాక్ రికార్డు కూడా ఉందట లక్ష్మీపతి రాజుకు. బెంగళూరులో వ్యాపార లావాదేవీలున్న లక్ష్మీపతి రాజుకు బోయకొండ గంగమ్మ దేవస్థానం చైర్మన్ పదవి అప్పజెపితే, పార్టీని చౌడేపల్లి మండలంలో ముందుండి దిగ్విజయంగా నడిపిస్తారని పార్టీ పెద్దలకు పుంగనూరు ఇన్‌ఛార్జ్ చల్లా బాబు సూచించినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Kommineni Srinivas Rao: జర్నలిస్ట్ కొమ్మినేని అరెస్ట్!
మరోపక్క, బోయకొండ గంగమ్మ చైర్మన్ రేసులో అదే నియోజకవర్గానికి చెందిన ఎస్.కె.వెంకటరమణారెడ్డి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్.కె.వెంకటరమణారెడ్డి మొదట్లో కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోసం పనిచేసినట్లు టీడీపీ నేతల దృష్టిలో ఉంది. 2019లో పుంగనూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి, దాదాపు 2,200 ఓట్లు చీల్చడం ద్వారా అప్పట్లో టీడీపీ అభ్యర్థికి కాస్త మైనస్ అయింది. మరోపక్క, 2009లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులతో బోయకొండ గంగమ్మ చైర్మన్ పదవిని ఎస్.కె.వెంకటరమణారెడ్డి పొందడం, అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే బోయకొండ గంగమ్మ దేవస్థానానికి తన సతీమణి రతీ దేవిని చైర్మన్‌గా నియమించుకోవడంలో వెంకటరమణారెడ్డి సక్సెస్ అయ్యారు. 2024 ఎన్నికలకు ముందు, వైసీపీకి రాష్ట్రంలో ఎదురుదెబ్బ తప్పదని తెలిసిన వెంటనే ఆ పార్టీని వీడి, తిరిగి టీడీపీలోకి ఎస్.కె.వెంకటరమణారెడ్డి చేరినట్లు రాజకీయ వర్గాలల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, మొదటి నుంచి టీడీపీ గెలుపు కోసం కష్టపడి పనిచేసిన చౌడేపల్లికి చెందిన లక్ష్మీపతి రాజు అలియాస్ పతి రాజుకు, బోయకొండ గంగమ్మ దేవస్థానం చైర్మన్ పదవి అప్పజెప్పాలని పార్టీ హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం.
లక్ష్మీపతి రాజు సొంత చిన్నాన్న వెంకటరమణ రాజు 2019లో టీడీపీ పార్టీ తరఫున పుంగనూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ లెక్కవేసుకుంటే, బోయకొండ గంగమ్మ దేవస్థానం చైర్మన్ పదవి తప్పకుండా లక్ష్మీపతి రాజుని వరిస్తుందని అక్కడి టీడీపీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.