Mahaa Conclave: ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధి మరియు యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా మహా గ్రూప్ సంస్థల సీఎండీ మారెళ్ల వంశీ కృష్ణ ఆధ్వర్యంలో ‘రైజింగ్ ఏపీ మహా కాన్‌క్లేవ్’ (మహాన్యూస్ కాన్‌క్లేవ్) నిర్వహిస్తున్నారు. విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సు నేపథ్యంలో జరుగుతున్న ఈ కాన్‌క్లేవ్‌లో రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, సాఫ్ట్‌వేర్ సంస్థల అధినేతలు పాల్గొని కీలక చర్చలు జరపనున్నారు.
ఈ సందర్భంగా, మహా వంశితో మాట్లాడిన ఏపీ విశాఖ ఎంపీ భరత్, కూటమి ప్రభుత్వం పెట్టుబడి వ్యూహాలపై గత ప్రభుత్వ వైఫల్యాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
పెట్టుబడుల లక్ష్యం: రూ.9.8 లక్షల కోట్లు
2019 నుంచి 2024 వరకు నిర్వహించిన సదస్సుల్లో పెద్దగా పెట్టుబడులు రాలేదని, ఉద్యోగ, ఉపాధి కల్పనను వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం గాలికొదిలేసిందని శ్రీభరత్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన కొద్ది కాలంలోనే 9 లక్షల కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ఆయన స్పష్టం చేశారు.
రాబోయే సీఐఐ భాగస్వామ్య సదస్సులో మొత్తం 410 ఎంఓయూలు జరగనున్నాయని, దీని ద్వారా రూ.9.8 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి రానున్నాయని శ్రీభరత్ వెల్లడించారు.
ఈ మొత్తం పెట్టుబడులలో విశాఖ నగరానికి మాత్రమే రూ.1 లక్ష నుంచి రూ.1.5 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. “ఈజ్ ఆఫ్ డూయింగ్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” అనే నినాదంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని ఆయన ప్రకటించారు.
లోకేష్ చొరవ: గూగుల్ పెట్టుబడులు, లుల్లూ పునరాగమనం
ప్రపంచవ్యాప్త పారిశ్రామిక వేత్తల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు విశ్వాసం కల్పిస్తున్నారని శ్రీభరత్ అన్నారు. ఈ విషయంలో నారా లోకేష్ బాధ్యత మోయగల నాయకుడిగా నిరూపించుకుంటున్నారని తెలిపారు.
గతంలో గూగుల్ పెట్టుబడి పెట్టడానికి ఆసక్తిగా ఉన్నప్పుడు, లోకేష్ వెంటనే గూగుల్ ప్రతినిధులతో సమావేశమయ్యారని, మొదట రూ.50 వేల కోట్ల పెట్టుబడుల గురించి చర్చించగా, అది చివరకు రూ.1 లక్ష 30 వేల కోట్లకు చేరిందని వెల్లడించారు. 2019లో ప్రభుత్వం మారడంతో ఈ పెట్టుబడులు ఆగిపోయాయని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Shutdown Ends: ఎట్టకేలకు షట్‌డౌన్ ఎత్తేసిన ప్రభుత్వం.. బిల్ ఆమోదించిన US కాంగ్రెస్..
గత ప్రభుత్వ హయాంలో ‘లుల్లూ గోబ్యాక్’ అని అవమానపరిచేలా చేశారని, దీని కారణంగా లుల్లూ సంస్థ లేఖ రాసి వెళ్లిపోయిందని గుర్తు చేశారు. అయితే, తాజాగా ఆ సంస్థ ప్రతినిధులను కలిసి మళ్లీ పెట్టుబడులు పెట్టాలని కోరగా, పాత అనుభవాల కారణంగా మొదట వెనుకడుగు వేసినప్పటికీ, ప్రభుత్వం ఒప్పించడంతో లుల్లూ సంస్థ మళ్లీ పెట్టుబడులకు ముందుకొస్తుంది అని శ్రీభరత్ ధీమా వ్యక్తం చేశారు.
ప్రాంతీయ అభివృద్ధి లక్ష్యం
కూటమి ప్రభుత్వం ప్రతి జిల్లాకు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తోంది. రాజధాని అమరావతిని క్వాంటమ్ వాలీ కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు. ఉత్తరాంధ్రలో స్టీల్, ఫార్మా, బయోటిక్ రంగాలను అభివృద్ధి చేస్తున్నారు. కేంద్రమంత్రులలో చంద్రబాబు మరియు లోకేష్ బాగా పనిచేయగలుగుతున్నారనే నమ్మకం కలిగిందని, ఏపీలో స్థిరమైన ప్రభుత్వం ఉండటం ద్వారా వేగంగా అభివృద్ధి జరుగుతుందని శ్రీభరత్ పేర్కొన్నారు.

