ఇన్నిసార్లు.. అన్నిసార్లు అనే లెక్కలేదు. ఎప్పుడు స్వామి వారిని చూడాలని అనిపిస్తే అప్పుడు.. ఎప్పుడు శ్రీవారు అవకాశం కల్పిస్తే అప్పుడు తిరుమల వెంకన్న దర్శనం చేసుకునే వాడినని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. తన చిన్నతనం నుంచి తిరుపతి వేంకటేశుని దర్శనానికి వెళ్లడం ఒక అలవాటుగా మారిపోయిందని చెప్పారు.
రైతు కుటుంబంలో పుట్టి.. ప్రభుత్వ ఉద్యోగిగా హైదరాబాద్ చేరి.. వ్యాపారవేత్తగా మారి.. మీడియా ప్రతినిధిగా ఎదిగి.. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ గా శ్రీవారి భక్తులకు సేవ చేస్తుకుని అపూర్వ అవకాశం అందుకున్న బీఆర్ నాయుడు.. మహా న్యూస్ ఛైర్మన్ మారెళ్ల వంశీకృష్ణతో ప్రత్యేకంగా ముచ్చటించారు. తన జీవిత ప్రస్థానం.. శ్రీవారి భక్తునిగా తన అనుభవాలు.. రాజకీయంగా తన స్టాండ్.. టీటీడీ ఛైర్మన్ గా వేంకటేశుని దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యాన్ని కల్పించాలి.. ప్రశాంతంగా దేవదేవుని దర్శనం చేసుకుని భక్తులు ఆనందపరవశులు కావడానికి ఎటువంటి ఏర్పాట్లు చేయాలనీ అనుకుంటున్నారు.. ఇలా తన మనసులోని భావాలను మహా న్యూస్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో మహా వంశీతో పంచుకున్నారు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు.
ఇది కూడా చదవండి : వాళ్ల కథ శ్రీవారే చూసుకుంటారు: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
మహావంశీ అడిగిన ఒక ప్రశ్నకు బదులిస్తూ తన తల్లి లక్ష్మి నాయుడు నుంచి ఈ భక్తి భావం అలవడిందని బీఆర్ నాయుడు తెలిపారు. చిన్నతనంలో తనను శ్రీవారి దర్శనానికి ఆమె తీసుకువెళ్ళేవారని చెప్పారు. అప్పట్లో విపరీతమైన భక్తుల రద్దీ కారణంగా ఒక్కోసారి స్వామి వారి దర్శనం దొరికేది కాదన్నారు. అటువంటి సందర్భంలో కోనేటిలో కాళ్ళు కడుక్కుని.. తలమీద నీరు చల్లుకుని శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న దీపస్తంభం దగ్గర దీపం వెలిగించి అక్కడి నుంచే స్వామి వారికీ నమస్కారం చేసుకుని తిరుగు ప్రయాణం అయ్యేవారిమని శ్రీవారి దర్శనం విషయంలో తన చిన్ననాటి అనుభవాలను వివరించారు బీఆర్ నాయుడు. అలా చిన్నతనంలో తనలో వేంకటేశుని దర్శనంపై మక్కువ పెంచిన అమ్మ లక్ష్మి ఆశీస్సులతోనే ఈరోజు తనకు టీటీడీ ఛైర్మన్ గా భక్తులకు సేవ చేసుకునే అవకాశం లభించిందని భావిస్తున్నానన్నారు. తన తల్లి తనకు చూపించిన ఈ మార్గంలో నిజాయతీగా.. శ్రీవారి ఆశీస్సులతో పని చేస్తాననీ.. ప్రతి భక్తుడు తిరుమలలో ఆధ్యాత్మిక పరిమళాల్ని ఆస్వాదిస్తూ.. నిర్మలమైన మనసులో నిండైన శ్రీవారి రూపాన్ని నింపుకుని ఇంటికి చేరాలన్నదే తన కోరిక అని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు.
మహా వంశీతో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూను పూర్తిగా ఈ క్రింది వీడియోలో చూడండి.