Mahaa Bhakthi: చూడటానికి రెండు కళ్లూ చాలలేదు.. హర హర మహాదేవునికి వైభవంగా జరుగుతున్న ఉత్సవం.. ఓం నమశ్శివాయహః అంటూ పరమ శివునికి చేస్తున్న క్రతువులు.. చిన్నారుల యోగ విన్యాసాలు.. ప్రముఖ సినీ సంగీత కళాకారుల శివోహ గీతాలు.. మహాశివ భక్తుల భక్తి ప్రవచనాలు.. అతిరథ మహారథుల అభినందనల వెల్లువ.. పన్నెండు గంటల పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరినీ కట్టి పడేశాయి. మహా న్యూస్ ఛానల్ గా మొదలై . . మహా మ్యాక్స్ వినోదాన్ని పంచి.. ఆధ్యాత్మిక తరంగాలను తెలుగు ప్రజల ముంగిట 24 గంటలు ఉండేలా చేయడానికి మహా భక్తిని పరిచయం చేస్తూ శివోహం అంటూ సాగిన మహా జాగరణోత్సవం ఆద్యంతం అందరినీ అలరించింది.
Mahaa Bhakthi: మహా వంశీ దంపతుల గణపతి పూజతో ప్రారంభమైన మహా జాగరణ మహోత్సవం శివోహం శివపార్వతులకు మహా వంశీ దంపతులు చేసిన కల్యాణోత్సవంతో ముగిసింది . పన్నెండు గంటల పాటు ఆధ్యాత్మిక పరవశం.. నభూతో నభవిష్యతి అన్న చందంగా శివోహం ప్రాంగణంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా టీవీల ముందు కూచున్న తెలుగు ప్రజలకు సరికొత్త అనుభూతిని ప్రసాదించింది. శ్రీశ్రీశ్రీ మహామండలేశ్వర్ కైలాసానంద గిరిజా మహారాజ్ ఆశీస్సులతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా, మంత్రివర్యులు నారా లోకేష్ గౌరవ అతిథిగా కార్యక్రమానికి హాజరై మహా భక్తి ఛానల్ ఆవిష్కరణోత్సవాన్ని అంబరాన్నంటే సంబరంగా చేశారు.
Mahaa Bhakthi: పన్నెండు గంటల మహా జాగరణ.. మహాదేవుని సమక్షంలో లౌకిక విషయాలను పక్కన పెట్టి ఆధ్యాత్మిక చింతనలో గడపడం అందరిలోనూ సరికొత్త అనుభూతిని నింపింది. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు.. ఆ పరమశివుడు అమరావతి పట్టణంలో మహా వంశీ ఆధ్వర్యంలో మహోన్నత జాగరణోత్సవాన్ని కన్నుల పండువగా జరిపించుకున్నారనిపించేలా కార్యక్రమం ఆద్యంతం అలౌకిక అనుభూతులను పంచింది .
Mahaa Bhakthi: సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా.. నేటి తరానికి హైందవ ధర్మ సూక్ష్మాలను.. మన ధర్మం మనకందించిన అమూల్యమైన ఆధ్యాత్మిక పరిమళాలను పరిచయం చేస్తూ . . భావితరాలకు సనాతన ధర్మ బాటను మహా భక్తి ఛానల్ వేయబోతోంది . అందుకు తొలి అడుగుగా శివోహం పేరుతో మహా జాగరణోత్సవాన్ని నిర్వహించారు మహా వంశీ. మహా గ్రూప్ నుంచి ఇప్పటికే అత్యంత ప్రజాదరణతో దూసుకు పోతున్న మహా న్యూస్ , మహా మ్యాక్స్ ఛానల్స్ కు తోడుగా తెలుగు ప్రజల కోసం 24 గంటల ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తూ మహా భక్తి ఛానల్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరినీ మహా గ్రూప్ చైర్మన్ , ఎండీ మారెళ్ల వంశీకృష్ణ అభినందించారు.