Maganti Gopinath Family: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల బరిలో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా నిలిచిన మాగంటి సునీతకు సొంత కుటుంబం నుంచే ఊహించని షాక్ తగిలింది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ వారసత్వం, ముఖ్యంగా ఆమె పొందిన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ చుట్టూ ముసలం ముదిరింది. ఈ వివాదం ఇప్పుడు ఎమ్మార్వో (MRO) కార్యాలయం వరకు చేరి, ఉపఎన్నికల సమయంలో తీవ్ర రాజకీయ చర్చకు దారితీసింది.
ఎమ్మార్వో విచారణ: కుటుంబ సభ్యుల హాజరు
మాగంటి సునీత పొందిన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్‌పై గోపినాథ్ మొదటి భార్యగా పేర్కొంటున్న మాగంటి మాలినీదేవి మరియు ఆమె కుమారుడు ప్రద్యుమ్న తారక్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పూర్తి విచారణ చేపట్టాలని రెవెన్యూ అధికారులు నిర్ణయించారు.
ఇది కూడా చదవండి: Wine Shops Close: మందుబాబులకు భారీ షాక్.. 4 రోజులు మద్యం షాపులు బంద్!
మాగంటి మాలినీదేవి, ఆమె కుమారుడు ప్రద్యుమ్న తారక్, మరియు మాగంటి గోపినాథ్ తల్లి మహానందకుమారి హాజరయ్యారు.బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తరపున ఆమె చిన్న కూతురు దిశిర, లీగల్ అడ్వైజర్ లలితరెడ్డి విచారణకు హాజరయ్యారు. ఎమ్మార్వో ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత, పూర్తి డాక్యుమెంట్లు, సర్టిఫైడ్ కాపీలు దాఖలు చేయడానికి విచారణను నవంబర్ 25వ తేదీకి వాయిదా వేశారు.
మొదటి భార్య మాలినీదేవి ఆరోపణలు
ఎమ్మార్వో కార్యాలయం వద్ద విచారణ అనంతరం మాలినీదేవి మీడియాకు కీలక విషయాలు వెల్లడించారు: “తమ ఉనికిని దాచిపెట్టి, తమ పేర్లు లేకుండా మాగంటి సునీత గారు తప్పుడు సమాచారంతో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్‌ను పొందారు. తమ ఫిర్యాదును పరిశీలించిన అధికారులు, అందులో వాస్తవం ఉందని గ్రహించి, గతంలో సునీత గారికి జారీ చేసిన సర్టిఫికెట్‌ను రద్దు చేశారు. అందుకే ఈ విచారణకు పిలిచారు.”
ఇది కూడా చదవండి: Rain Alert: మళ్లీ వర్షాలు.. రాబోయే 2 రోజులు వాతావరణం ఎలా ఉందంటే?
గోపినాథ్ గారికి, తనకు చట్టప్రకారం ఎప్పుడూ విడాకులు కాలేదని ఆమె స్పష్టం చేశారు. తానే చట్టబద్ధమైన భార్యగా, తమ కుమారుడు ప్రద్యుమ్న తారక్ చట్టబద్ధమైన వారసుడిగా ఉన్నప్పుడు తమను కాదని సర్టిఫికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు.ఇది ఆస్తి వాటాల గురించి కాదని, తమ హక్కుల గురించి, తమ గుర్తింపు గురించి పోరాడుతున్నట్లు ఆమె ధీమా వ్యక్తం చేశారు.
కుమారుడు ప్రద్యుమ్న తారక్ వ్యాఖ్యలు
మాలినీదేవి కుమారుడు ప్రద్యుమ్న తారక్ మాట్లాడుతూ, సునీతకు జారీ చేసిన సర్టిఫికెట్‌పై అభ్యంతరాలు తెలిపేందుకే వచ్చానని చెప్పారు. “మా నాన్న చనిపోయే వరకు మాతో బాగానే మాట్లాడేవారు. కానీ, చనిపోయినప్పుడు మేం రాకుండా మమ్మల్ని బెదిరించారు.”
నేను రాజకీయ అంశాల జోలికి వెళ్లను. వారసత్వం కోసం పోరాడుతున్నాను. మా నానమ్మ (గోపీనాథ్ తల్లి మహానందకుమారి) కూడా మాకు మద్దతుగా ఉన్నారు,” అని ప్రద్యుమ్న తారక్ తెలిపారు.
బీఆర్‌ఎస్ అభ్యర్థికి సొంత కుటుంబం నుంచి వారసత్వ గుర్తింపుపై సవాలు ఎదురుకావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ వివాదం ఉపఎన్నికల ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

