Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు రాబోయే మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఈరోజు (బుధవారం) ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవచ్చని హెచ్చరికలు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో వర్షాల పరిస్థితి
బుధవారం:
* అతి భారీ వర్షాలు: నంద్యాల, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో.
* భారీ వర్షాలు: డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం మన్యం జిల్లాల్లో.
గురువారం:
* అతి భారీ వర్షాలు: ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో.
* భారీ వర్షాలు: అనంతపురం, కర్నూలు, నంద్యాల, వైఎస్సార్ కడప, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో.
ఈ వర్షాల కారణంగా బుధవారం నుండి శనివారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.
తెలంగాణలో వర్షాల పరిస్థితి
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈరోజు (బుధవారం) నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హైడ్రా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
* భారీ వర్షాల నేపథ్యంలో ఎప్పటికప్పుడు రోడ్లపై నీరు నిలవకుండా, ట్రాఫిక్ సమస్యలు రాకుండా హైడ్రా చర్యలు చేపట్టింది.
* అధికారులు, ఉద్యోగుల సెలవులు రద్దు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
* భారీ వర్షాల కారణంగా పాఠశాలలు, కాలేజీలకు బుధవారం సెలవు ప్రకటించారు.
* సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు వీలైతే ‘వర్క్ ఫ్రం హోమ్’ చేసేలా చర్యలు తీసుకోవాలని యాజమాన్యాలకు సూచించింది.