Rain Alert: ఆంధ్రప్రదేశ్‌కు తుఫాన్ ముప్పు పొంచి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం కీలక హెచ్చరిక జారీ చేసింది. రాబోయే రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం, ఆపై తుఫాన్ ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ అధికారులు తెలిపారు. ఈ తుఫాన్ కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
నవంబర్ 22, 2025 శనివారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడవచ్చు. ఇది క్రమంగా బలం పుంజుకుని, పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ నవంబర్ 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత, తదుపరి 48 గంటల్లో ఇది తుఫాన్‌గా బలపడి, ఆంధ్రప్రదేశ్ తీరం వైపుగా కదిలే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వివరించింది.
ఈ తుఫాన్ ప్రభావంతో నవంబర్ 26 నుంచి 29 మధ్య తీరప్రాంత ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు పడతాయి. ఈ రోజుల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని, అయితే 27, 28 తేదీల్లో మాత్రం ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. నవంబర్ 30న కూడా కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొనసాగవచ్చు. కాబట్టి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముందు జాగ్రత్త చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని అధికారులు సూచించారు.
ఇక, తుఫాన్ రాకముందే రాష్ట్రంలో ప్రస్తుతం కూడా కొన్నిచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడవచ్చు. అలాగే, శుక్రవారం కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రజలు ఈ తాజా వాతావరణ మార్పులను గమనించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

