Local Elections: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తున్నది. గ్రామ పంచాయతీ సహా ఇతర స్థానిక ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా స్పష్టత లేనట్టు తెలుస్తున్నది. కులగణన ఆధారంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల హామీ నెరవేరేలా కనిపించడం లేదు. స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించి, కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. ఇప్పటివరకూ కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకపోగా, తాజాగా జనగణనలో కులగణన నిర్వహించాలన్న కేంద్రం నిర్ణయంతో మరింత జాప్యం జరిగే అవకాశం ఉన్నది.
Local Elections: తొలుత కులగణన ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. కులగణనకు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధం లేదని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని అన్నారు. ఈ వ్యాఖ్యలతో గందరగోళం నెలకొని సందిగ్ధం నెలకొన్నది. ఎన్నికల షెడ్యూల్‌పై అనిశ్చితి మరింత పెరిగింది. దీంతో పంచాయతీ, ఇతర స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహులు ఇంకొంత కాలం వేచి ఉండాల్సిందేనన్న మాట.
Local Elections: కులగణన అంశం కేంద్రానిదేనని, కొన్ని రాష్ట్రాలు నిర్వహించిన సర్వేలకు పారదర్శకత, సాధికారత ఉండబోదని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. దీంంతో రాష్ట్రంలో చేపట్టిన కులగణన చెల్లబోదని తెలుస్తున్నది. అందుకే కేంద్రం ఆ బిల్లును ఆమోదించకుండా ఆపిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తాజా నిర్ణయంతో ఆ బిల్లును ఆమోదించబోదని కూడా తేటతెల్లమైందని వారు భావిస్తున్నారు.
Local Elections: అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కులగణన నిర్వహిస్తాం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 32 శాతానికి పెంచి 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిథ్యం కల్పిస్తాం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణనూ అమలు చేసి తీరుతాం.. అని కాంగ్రెస్ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్నది. ఇప్పుడు కులగణన చేసే అధికారం రాష్ట్రాలకు లేదని కేంద్రం తేల్చడంతో అయోమయం నెలకొన్నది.
Local Elections: ఈ దశలో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలంటే, రాష్ట్రం పంపిన కులగణన ప్రతిపాదనలను కేంద్రం ఆమోదించాలి. ఆ వెంటనే రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుంది. లేదంటే కేంద్రం కులగణన నిర్వహించాలంటే ఆలస్యం అవుతుంది. కాబట్టి గత రిజర్వేషన్ల మేరకే ఎన్నికలకు వెళ్లాలి. దీంతో కాంగ్రెస్ ఇచ్చిన హామీని విస్మరించినట్టవుతుంది. బీసీలకు అన్యాయం జరుగుతుంది.