Lionel Messi: భారత ఫుట్‌బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణం వచ్చింది. అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం, ప్రపంచవ్యాప్తంగా ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్ (GOAT)’గా గుర్తింపు పొందిన లియోనెల్ మెస్సీ నేడు భారత్ పర్యటనకు రానున్నారు. 14 ఏళ్ల తర్వాత ఆయన మళ్లీ భారత గడ్డపై అడుగుపెడుతున్నారు.
‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా’ పేరుతో సాగనున్న ఈ ప్రత్యేక పర్యటన శనివారం తెల్లవారుజామున కోల్‌కతాలో ప్రారంభమవుతుంది. 2011 తర్వాత మెస్సీ భారత్‌కు రావడం ఇదే తొలిసారి కావడంతో కోల్‌కతా నగరమంతా సందడితో నిండిపోయింది. అప్పట్లో ఫిఫా స్నేహపూర్వక మ్యాచ్‌లో అర్జెంటీనా జట్టు తరఫున మెస్సీ ఆడగా, ఈసారి మాత్రం ఆయన ప్రమోషనల్ కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొననున్నారు.
శనివారం సాల్ట్‌లేక్ స్టేడియంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో మెస్సీ పాల్గొంటారు. ఈ ఈవెంట్‌కు సుమారు 78 వేల మంది ప్రేక్షకులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఆయన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, భారత మాజీ క్రికెట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్‌లను కలుస్తారు. భద్రతా కారణాల వల్ల లేక్‌టౌన్‌లో ఏర్పాటు చేసిన తన 70 అడుగుల విగ్రహాన్ని మెస్సీ వర్చువల్‌గా ఆవిష్కరించనున్నారు.
Also Read: Rahul Gandhi: నేడు హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ..
హైదరాబాద్‌లో హైలైట్ ఈవెంట్
కోల్‌కతా కార్యక్రమాలు ముగిసిన వెంటనే మెస్సీ శనివారం హైదరాబాద్‌కు చేరుకుంటారు. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం, ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో నిర్వహించే ‘గోట్ కప్’ ఎగ్జిబిషన్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఆడనున్నారు. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొననుండటం విశేషం.
ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా హాజరుకానున్నారు. భద్రత దృష్ట్యా పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. సుమారు 2,500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయగా, టికెట్లు ఉన్నవారికే స్టేడియంలోకి అనుమతి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
ఆదివారం మెస్సీ ముంబైకి వెళ్లనున్నారు. అక్కడ క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలో క్రికెట్ ప్రముఖులతో పికిల్‌బాల్ మ్యాచ్‌లో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో సచిన్ టెండూల్కర్ కూడా పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. అనంతరం వాంఖడే స్టేడియంలో జరిగే చారిటీ ఫ్యాషన్ షో, కోచింగ్ క్లినిక్‌లో పాల్గొంటారు.
పర్యటన చివరి రోజు సోమవారం ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే కార్యక్రమానికి మెస్సీ హాజరవుతారు. అక్కడ చిన్నారులకు ప్రత్యేక కోచింగ్ క్లినిక్‌ను నిర్వహించనున్నారు. అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలవడంతో మూడు రోజుల గోట్ ఇండియా టూర్ ముగియనుంది.
