Lavu krishna devarayalu: మూడు మరణాలకు బాధ్యత వహించాలంటూ డిమాండ్

Lavu krishna devarayalu: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి ఇటీవల పల్నాడు జిల్లాలో నిర్వహించిన పరామర్శ యాత్ర తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఈ యాత్ర సందర్భంగా జరిగిన అల్లర్లలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందిన విషయాన్ని టీడీపీ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. పరామర్శ పేరిట జగన్‌ అరాచకానికి పాల్పడ్డారంటూ తీవ్ర విమర్శలు చేశారు.

మంగళవారం రోజున పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం కొత్తూరులో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం టీడీపీ సీనియర్ నేత, సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, “సత్తెనపల్లి మండలంలోని రెంటపాళ్లలో ఓ బెట్టింగ్ రాయుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ వెళ్లిన తీరు దురదృష్టకరం. పరామర్శ పేరుతో అక్కడ సృష్టించిన అరాచకం బాధాకరం,” అని వ్యాఖ్యానించారు. “ఈ గందరగోళం కారణంగా వైసీపీ ఉప సర్పంచ్ నాగ మల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడు. జగన్ పర్యటన వల్ల ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాలకు జగన్ సమాధానం చెప్పాలి,” అంటూ డిమాండ్ చేశారు.

అదే విధంగా, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ, “జగన్ పరామర్శ పేరుతో సత్తెనపల్లిలో ఉద్రిక్తతలు కలగజేశారు. ఆయన భారీ కాన్వాయ్ వల్ల ట్రాఫిక్ స్తంభించి, అంబులెన్స్‌కు దారి లేకపోవడం వల్ల ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరొరిద్దరు కూడా ఇదే పర్యటన సమయంలో చనిపోవడం శోచనీయం. ఒకరిని పరామర్శించడానికి వచ్చి ముగ్గురి ప్రాణాలను తీసే పరిస్థితి తలెత్తింది,” అని ఆవేదన వ్యక్తం చేశారు.

తరువాత టీడీపీ నేతలు పలువురు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *