Kurnool: ఉల్లి రైతులకు 50 వేలు.. ప్రభుత్వం గుడ్ న్యూస్

Kurnool: కర్నూలు జిల్లా ఉల్లి రైతులకు అండగా నిలుస్తున్నామని టీడీపీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి తెలిపారు. ఉల్లి ధరలు పతనంతో నష్టపోయిన రైతులకు హెక్టారుకు రూ.50,000 ఆర్థిక సాయం అందజేయాలని చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన మంగళగిరిలో జరిగిన మీడియా సమావేశంలో చెప్పారు. ఈ చర్యతో రూ.100 కోట్లకు పైగా భారం పడినా, ప్రభుత్వం రైతు సంక్షేమానికే ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.

ఈ నిర్ణయంతో 24,218 మంది రైతులు, 45,278 ఎకరాల్లో సాగు చేసిన ఉల్లిపంటకు లాభం చేకూరుతుందని తిక్కారెడ్డి వివరించారు. కిలో ఉల్లి ధర రూ.12 కంటే తగ్గకుండా ఉండేలా ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేస్తోందని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ రైతు పక్షపాతిగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు.

గత జగన్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తిక్కారెడ్డి ఆరోపించారు. “ఉల్లి ధరలు రెండు, నాలుగు రూపాయలకు పడిపోయి రైతులు కూలీ ఖర్చులూ రాకుండా నష్టపోయారు. ధరల స్థిరీకరణ నిధి పేరుతో ఇచ్చిన హామీ కూడా అమలు కాలేదు” అని విమర్శించారు. అయితే, టీడీపీ ప్రభుత్వ హయాంలో (2016, 2018) మార్కెట్ జోక్యం చేసుకుని లక్షల క్వింటాళ్ల ఉల్లిని కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నామని గుర్తుచేశారు.

ప్రస్తుతం ప్రభుత్వం ఉల్లితో పాటు మామిడి, పొగాకు, కోకో, కాఫీ రైతులకు కూడా అండగా నిలుస్తోందని చెప్పారు. ఏడాదికి రూ.20,000 పెట్టుబడి సాయం హామీ మేరకు తొలి విడతగా రూ.7,000 ఇప్పటికే జమ చేసినట్లు తెలిపారు. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ప్రాజెక్ట్ ద్వారా కేవలం 100 రోజుల్లో 1,800 క్యూసెక్కుల నీటిని విడుదల చేసి చంద్రబాబు చారిత్రక ఘనత సాధించారని అన్నారు. టమాటా రైతుల కోసం పత్తికొండలో టమాటా జ్యూస్ ఫ్యాక్టరీని త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు.

అలాగే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు నారా లోకేశ్ కృషి చేస్తున్నారని, కర్నూలును ఇండస్ట్రీ హబ్‌గా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని తిక్కారెడ్డి తెలిపారు.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *