కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం పారిశ్రామికవేత్తల పట్ల తీసుకుంటున్న వైఖరిపై కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రవర్తన ఈ విధంగానే కొనసాగితే, ఒకవేళ ఇన్ఫోసిస్ సంస్థ తన కార్యకలాపాలను ఆంధ్రప్రదేశ్‌కి మార్చుకుంటే రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలంటూ హెచ్చరించారు.
పారిశ్రామికవేత్తల పట్ల ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య వైఖరి సరైంది కాదని కుమారస్వామి మండిపడ్డారు. ఇటీవల ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, ఆయన అర్ధాంగి, రాజ్యసభ సభ్యురాలు సుధా మూర్తి కులగణనలో పాల్గొనబోమని చెప్పినందుకు, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు అవమానకరమని అన్నారు. “ఇలా పారిశ్రామికవేత్తలను తక్కువ చేసి మాట్లాడటం కర్ణాటక ఇమేజ్‌కు మచ్చ” అని విమర్శించారు.
అలాగే, నగరంలోని రోడ్ల పరిస్థితిపై బయోకాన్ సీఎండీ కిరణ్ మజుందార్ షా చేసిన వ్యాఖ్యలకు స్పందనగా, ప్రభుత్వ నేతలు ఆమెను అబద్ధాలు చెబుతున్నారని విమర్శించడం మరింత దారుణమని అన్నారు. ఈ వ్యాఖ్యలతో కుమారస్వామి పరోక్షంగా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ను ఉద్దేశించినట్లు స్పష్టమవుతోంది.
కర్ణాటకలో ప్రస్తుతం అభివృద్ధి కార్యక్రమాలు నత్తనడకన సాగుతున్నాయని, ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడంలో విఫలమైందని కుమారస్వామి ఆరోపించారు. “పారిశ్రామికవేత్తలను దూరం చేస్తే, పెట్టుబడులు ఎలా వస్తాయి? ప్రభుత్వం తీరుతెన్నులు మారకపోతే రాష్ట్రానికి నష్టం తప్పదు” అని ఆయన హెచ్చరించారు.