KTR

KTR: 6 గంటలకు మించి కరెంట్ ఉండట్లేదు.. ఇది ఎల్‌నినో కాదు.. ఎల్‌ కాంగ్రెస్ ఎఫెక్ట్.. !

KTR: తెలంగాణలో నెలకొన్న విద్యుత్ సంక్షోభం, అనధికారిక విద్యుత్ కోతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణకు కరెంట్ అనేది విలాసం కాదని, రాష్ట్ర ప్రగతికి అది ప్రధాన జీవనరేఖ అని స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో వెలుగులు జిమ్మిన తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చీకట్లు అలుముకున్నాయని, “కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదు” అన్న తమ మాటలు నిజమవుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలోని విద్యుత్ ప్లాంట్లు, సింగరేణి బొగ్గు గనుల్లో వాస్తవాలను ప్రజల ముందుకు తెచ్చేందుకు బీఆర్ఎస్ తరఫున ఆరు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించుతున్నట్లు ప్రకటించారు.

6 గంటలకు మించి కరెంట్ ఉండట్లేదు..

రాష్ట్రంలోని పలు మండలాల్లో ఆరు గంటలకు మించి సరఫరా ఉండటం లేదని, కరెంట్ సమస్యలపై రైతులు, ప్రజలు మండల కేంద్రాల్లో ధర్నాలు చేయాల్సిన దుస్థితి వచ్చిందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.  కరెంట్ కోతలపై అడిగితే వాతావరణాన్ని, ఎల్ నినోను బూచిగా చూపిస్తున్నారని.. ఇది ఎల్ నినో ప్రభావం కాదని, కేవలం కాంగ్రెస్ చేతకానితనం వల్ల వచ్చిన ‘ఎల్ కాంగ్రెస్’ ప్రభావమేనని తీవ్రస్థాయిలో ఎద్దేవా చేశారు.

తెలంగాణ ఉద్యమంలోనే కరెంట్ సమస్య కీలక భూమిక పోషించిందని, స్వరాష్ట్రం సిద్ధించాక మాజీ సీఎం కేసీఆర్ విద్యుత్ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టి, సబ్‌స్టేషన్లు నిర్మించి 24 గంటల నిరంతర నాణ్యమైన ఉచిత కరెంట్ అందించారని గుర్తుచేశారు.
జెన్‌కోలో బొగ్గు కొరత – సింగరేణిలో 40 లక్షల టన్నులు మాయం?
తెలంగాణ జెన్‌కో థర్మల్ పవర్ ప్లాంట్లకు నాణ్యమైన బొగ్గు సరఫరా కావడం లేదని, బొగ్గు నిల్వలు లేక ప్లాంట్లలో ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పడిపోయిందని ఆరోపించారు. సింగరేణిలో దాదాపు 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని కేటీఆర్ ఆరోపించారు. బొగ్గు సమృద్ధిగా ఉంటే విద్యుత్ ఉత్పత్తి ఎందుకు తగ్గుతోందని ప్రశ్నించారు. నీటి లభ్యత లేక హైడల్ ప్లాంట్లు, సరైన నిర్వహణ లేక థర్మల్ ప్లాంట్లు మూతపడుతున్నాయని.. గత వారంలోనే 3 థర్మల్, 2 హైడల్ యూనిట్లు ఆగిపోవడంతో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తట్టుకోలేక ప్రభుత్వం చేతులెత్తేసిందని పేర్కొన్నారు.
క్షేత్రస్థాయి పరిశీలనకు బీఆర్ఎస్ 6 బృందాలు
విద్యుత్ ఉత్పత్తి తగ్గడానికి కారణాలు, బొగ్గు నాణ్యత, సరఫరా వాస్తవాలను వెలికితీసేందుకు సీనియర్ నేతలతో కూడిన ఆరు నిజనిర్ధారణ బృందాలు ఆయా ప్రాజెక్టులను సందర్శించనున్నాయి:
  • యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్: మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి బృందం
  • కేటీపీఎస్ (KTPS): ఎంపీ వద్దిరాజు రవిచంద్ర బృందం
  • భద్రాద్రి పవర్ ప్లాంట్: మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బృందం
  • సింగరేణి హెడ్‌ఆఫీస్: బీఆర్ఎస్ ప్రత్యేక ప్రతినిధి బృందం

ఈ బృందాలు ప్లాంట్లను ప్రత్యక్షంగా పరిశీలించి, అధికారులతో మాట్లాడి నివేదికను ప్రజల ముందుంచుతాయని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్లాంట్లు పూర్తి సామర్థ్యంతో ఎందుకు నడవడం లేదో ప్రభుత్వం ప్రజలకు తక్షణమే శ్వేతపత్రం ద్వారా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *