AP Cabinet: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో బుధవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో పరిపాలన, శాంతిభద్రతలు, రాజధాని అమరావతి అభివృద్ధి మరియు పారిశ్రామిక పెట్టుబడులకు సంబంధించి 60కి పైగా కీలక అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో నాలుగు ప్రధాన నగరాల్లో కొత్త పోలీస్ కమిషనరేట్లను ఏర్పాటు చేయడానికి కేబినెట్ అధికారికంగా ఆమోదముద్ర వేసింది.
4 కొత్త పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటు – జోన్ల విభజన..
శాంతిభద్రతల పరిరక్షణ, వేగవంతమైన పర్యవేక్షణే లక్ష్యంగా నాలుగు కేంద్రాల్లో నూతన కమిషనరేట్లను కేబినెట్ ఖరారు చేసింది.
-
గుంటూరు కమిషనరేట్: గుంటూరు అర్బన్, గుంటూరు రూరల్, అమరావతి క్యాపిటల్ రీజియన్, తెనాలి జోన్లు దీని పరిధిలోకి వస్తాయి.
-
తిరుపతి కమిషనరేట్: తిరుమల, తిరుపతి, శ్రీకాళహస్తి, శ్రీసిటీ జోన్లతో ఈ కమిషనరేట్ ఏర్పాటవుతుంది.
-
రాజమహేంద్రవరం కమిషనరేట్: మొత్తం 3 ప్రత్యేక జోన్లతో పరిపాలన సాగనుంది.
-
కర్నూలు కమిషనరేట్: 2 జోన్లు, 5 సబ్-డివిజన్లతో విస్తరించనున్నారు.
అమరావతికి నిధుల వరద – ఐకానిక్ అసెంబ్లీ స్పైర్ పనులు..
అమరావతి పరిధిలోని 29 గ్రామాల ల్యాండ్ పూలింగ్ స్కీమ్ (LPS) లేఅవుట్లలో సమగ్ర మౌలిక వసతుల కల్పన కోసం రూ. 1,548.98 కోట్లకు కేబినెట్ పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. దింతో పటు రాజధాని మౌలిక సదుపాయాల విస్తరణ పనులకు అదనంగా మరో రూ. 644.98 కోట్లను కేటాయించింది.
అమరావతి అసెంబ్లీ శాశ్వత భవనంపై 250 మీటర్ల ఎత్తుతో నిర్మించే ఐకానిక్ స్పైర్, రూఫ్, అధునాతన లిఫ్టుల నిర్మాణ పనులకు రూ. 661 కోట్ల అంచనాతో టెండర్లు పిలిచేందుకు ఆమోదం తెలిపింది. రెండో దశ భూసమీకరణలో ఎకరా కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు కూడా రూ. 40 వేల కౌలు (యాన్యుటీ) చెల్లించే ప్రతిపాదనను ఆమోదించింది.
వేల కోట్ల పెట్టుబడులు – పారిశ్రామిక ప్రోత్సాహకాలు..
రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సిఫార్సు చేసిన పలు కీలక పెట్టుబడుల ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
-
పరిశ్రమలు & గ్రీన్‌ఫీల్డ్ యూనిట్లు:పల్నాడు జిల్లా దాచేపల్లిలో ‘మైహోమ్ ఇండస్ట్రీస్’ గ్రీన్‌ఫీల్డ్ సిమెంట్ యూనిట్‌కు టైలర్‌మేడ్ ప్రోత్సాహకాలు, తిరుపతి జిల్లా శ్రీసిటీలో ‘క్యాటర్‌పిల్లర్’ గ్రీన్‌ఫీల్డ్ ఫెసిలిటీ యూనిట్ ఏర్పాటుకు అనుమతులు ఇచ్చింది.
-
విశాఖలో ఐటీ హబ్:విశాఖపట్నంలో ప్రపంచ ప్రఖ్యాత ఐటీ కన్సల్టెన్సీ సంస్థ ‘డెలాయిట్’ (Deloitte), ముత్తూట్ ఫిన్‌కార్ప్ కార్పొరేట్ ఆపరేషన్స్ కేంద్రాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
-
కడపలో హైటెక్ విప్లవం:కడప కేంద్రంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో ఏఐఎల్ డిక్సన్ టెక్నాలజీస్‌తో పాటు క్వాంటం టెక్నాలజీ రంగంలో సుమారు రూ. 3,000 కోట్ల పెట్టుబడులతో సృష్టి క్వాంటం, క్వాంటం కోడాన్, అరోహాక్ టెక్నాలజీస్, ట్రైక్వాంటా ల్యాబ్స్, ఫోటాన్‌కోర్ సిస్టమ్స్ వంటి అత్యాధునిక పరిశోధన కేంద్రాల ఏర్పాటును ఆమోదించింది.
దీనితో పాటు విద్యుత్, పునరుత్పాదక ఇంధనం, టూరిజం, న్యాయాధికారుల పదవీ విరమణ వయసు పెంపు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల పాలసీకి సంబంధించిన ముసాయిదాలపై కేబినెట్ సమగ్రంగా చర్చించి ఆమోదముద్ర వేసింది.
