Mee Seva Services: తెలంగాణలో ప్రజా పాలనను పౌరుల గడప వద్దకే చేర్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక అడుగు వేసింది. సర్టిఫికెట్లు, ఇతర అధికారిక పత్రాల కోసం ప్రజలు మీసేవ కేంద్రాల చుట్టూ తిరిగే శ్రమ లేకుండా నేరుగా ఇంటి నుంచే సేవలు పొందేందుకు ‘మీసేవ డోర్ డెలివరీ’ (Meeseva Door Delivery) విధానాన్ని ప్రారంభించింది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బుధవారం హైదరాబాద్‌లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో ఈ సేవలను లాంఛనంగా ప్రారంభించారు.
స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవాలి?
-
టోల్‌ఫ్రీ నంబర్: పౌరులు 1100 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి తమకు నచ్చిన సమయానికి స్లాట్ బుక్ చేసుకోవచ్చు.
-
ఆన్లైన్ పోర్టల్: మీసేవ అధికారిక పోర్టల్‌లోకి వెళ్లి ఆన్లైన్ ద్వారా కూడా హోమ్ విజిట్ స్లాట్‌ను ఖరారు చేసుకోవచ్చు.
-
ఇంటికే ఎగ్జిక్యూటివ్: బుకింగ్ పూర్తయిన తర్వాత ప్రత్యేక శిక్షణ పొందిన మీసేవ ఎగ్జిక్యూటివ్ దరఖాస్తుదారుడి ఇంటికే వచ్చి బయోమెట్రిక్, డాక్యుమెంట్ల పరిశీలన పూర్తి చేసి దరఖాస్తును ప్రాసెస్ చేస్తారు.
ఇంటి ముంగిటే అందే కీలక సేవలు..
-
రెవెన్యూ & పౌర సేవలు: కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు (Caste, Income, Residence Certificates).
-
మున్సిపల్ సేవలు: జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు (Birth & Death Certificates).
-
రిజిస్ట్రేషన్ శాఖ: ఆస్తులకు సంబంధించిన ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ (EC కాపీలు), ఐజీఆర్ఎస్ (IGRS) రిజిస్ట్రేషన్ సేవలు.
-
పోలీస్ శాఖ: పోలీస్ వెరిఫికేషన్, ఎన్ఓసీ (NOC) సహా శాఖాపరమైన ఇతర ముఖ్య పౌర సేవలు.
పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభం – త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అమలు:
ఈ సర్వీసులను పారదర్శకంగా, వేగంగా నిర్వహించేందుకు మొదటి విడతలో 70 మందికి పైగా మీసేవ ఏజెంట్లు, గ్రామ స్థాయి వ్యవస్థాపకులకు (VLEs) సమగ్ర శిక్షణ అందించారు. తొలి దశలో భాగంగా హైదరాబాద్‌లోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టును పైలట్ ప్రాతిపదికన అమలు చేస్తున్నామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. క్షేత్రస్థాయి ఫీడ్‌బ్యాక్, ప్రజల నుంచి వచ్చే స్పందనను పరిగణనలోకి తీసుకుని రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాలు, గ్రామాలకు ఈ డోర్ డెలివరీ సేవలను విస్తరిస్తామని స్పష్టం చేశారు.
