KTR: తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు వివాదంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. బీఆర్‌ఎస్ శ్రేణులతో నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టును సీబీఐ విచారణకు అప్పగించడం వెనుక రాజకీయ ఉద్దేశ్యాలే ఉన్నాయని కేటీఆర్ ఆరోపించారు.
కేసీఆర్‌ను టార్గెట్ చేసేందుకే సీబీఐ విచారణ
కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కోరగానే సీఎం రేవంత్‌రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు అంశాన్ని సీబీఐకి అప్పగించారు. ఇది కేసీఆర్‌పై దుష్ప్రచారం చేయడానికి వేసిన వ్యూహం. కానీ మా పార్టీకి కోర్టులపై నమ్మకం ఉంది. ఎలాంటి అక్రమాలు జరగలేదన్న నమ్మకంతోనే మేము ఈ సవాళ్లను ఎదుర్కొంటాం అని కేటీఆర్ అన్నారు.
తెలంగాణ ప్రయోజనాలపై దాడి జరుగుతోంది
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ అంటే మా పార్టీపై దాడి కాదు, తెలంగాణ ప్రయోజనాలపై దాడి చేసినతే అన్నారు. కేసీఆర్‌పై కుట్ర కాదు, గోదావరి జలాలపై కుట్ర జరుగుతోంది. ఈ ప్రభుత్వాలు రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: అభివృద్ధిపై మీ అంకితభావం.. భవిష్యత్తు తరాలకు మార్గదర్శిగా నిలుస్తుంది
ఏపీకి నీళ్లు తరలించేందుకు కుట్ర
చంద్రబాబు ఆదేశాల మేరకు బనకచర్ల ప్రాజెక్టు కోసం రేవంత్‌రెడ్డి ఈ నాటకం ఆడుతున్నారు. కాళేశ్వరం విచారణ పేరుతో గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్‌కు తరలించేందుకు కుట్ర జరుగుతోంది. తెలంగాణ ప్రజలు ఈ యత్నాలను అడ్డుకుంటారు అని కేటీఆర్ ఆరోపించారు.
పోరాటం మాకు కొత్త కాదు
ప్రభుత్వాల అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడటం మా పార్టీకి కొత్త విషయం కాదు. తెలంగాణ కోసం జరిగిన పోరాటం ఈ రోజుకీ మాకు బాట చూపుతోంది. ఈసారి కూడా తెలంగాణ హక్కుల కోసం మేము చివరి వరకూ పోరాడతాం అని కేటీఆర్ స్పష్టం చేశారు.