KTR

KTR: సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్

KTR: పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి తిరిగి పోటీ చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మంచి చేసి ఉంటే, ఉప ఎన్నికలకు వెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు భయం పట్టుకుందని, ఉప ఎన్నికలు వస్తే ఎవరు గొప్పో ప్రజలు నిర్ణయిస్తారని అన్నారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ, పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు ప్రజల కోసం కాకుండా తమ సొంత లాభాల కోసమే కాంగ్రెస్ లోకి వెళ్లారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిజంగానే ప్రజలకు మంచి చేసి ఉంటే, ఉప ఎన్నికల్లో పోటీ చేసి తిరిగి గెలిచి చూపించాలని ఆయన సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి కేవలం సమయం వృథా చేసే మాటలు చెబుతూ, కేసీఆర్, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ నగరానికి రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదని స్పష్టం చేశారు. నాయకులు పార్టీ మారినా, కార్యకర్తలు మాత్రం బీఆర్ఎస్ జెండాను వదలలేదని ఆయన ప్రశంసించారు.

బ్లాక్ మెయిల్ దందాల కోసమే హైడ్రా: కేటీఆర్
హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాను వాడుకుంటోందని కేటీఆర్ ఆరోపించారు. హైడ్రా అరాచకాల వల్ల రియల్ ఎస్టేట్ పూర్తిగా దెబ్బతిందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బావమరిది తిరుపతి రెడ్డి దుర్గం చెరువు ఎఫ్.టి.ఎల్ లో అక్రమంగా కట్టిన ఇంటిని కూల్చే దమ్ము హైడ్రాకు ఉందా అని ఆయన ప్రశ్నించారు. పేదల ఇళ్లు కూల్చివేస్తున్న హైడ్రా, పెద్దల విషయంలో మాత్రం మౌనంగా ఉందని మండిపడ్డారు.

నరేంద్ర మోడీ సైతం ఆర్.ఆర్. టాక్స్ గురించి చెప్పారని, బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఎప్పుడూ ఇలాంటి కబ్జాలు, దందాలు జరగలేదని కేటీఆర్ గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 20 నెలల్లోనే హైడ్రా పేరుతో అరాచకం సృష్టించిందని దుయ్యబట్టారు. కోర్టు ఆదేశాలు ఉన్నా కూడా పట్టించుకోకుండా పేదల ఇళ్లను కూల్చారని ఆరోపించారు.

మీ అభివృద్ధిని చెప్పుకునే ధైర్యం ఉందా?
కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ అభివృద్ధిలో పరుగులు పెట్టిందని కేటీఆర్ అన్నారు. 2014లో గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ కు కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నా, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యుత్ సమస్యను పూర్తిగా పరిష్కరించారని చెప్పారు. హైదరాబాద్ ను మత, కుల రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేశామని తెలిపారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ పండుగలకు సమాన ప్రాధాన్యత ఇచ్చామని పేర్కొన్నారు. అందుకే 2023 ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా కాంగ్రెస్ కు రాకుండా ప్రజలు బీఆర్ఎస్ ను గెలిపించారని అన్నారు.

బీఆర్ఎస్ పదేళ్లలో చేసిన అప్పుల కంటే ఎక్కువ అప్పులను రేవంత్ రెడ్డి కేవలం 20 నెలల కాలంలోనే చేశారని కేటీఆర్ ఆరోపించారు. అభివృద్ధి గురించి చెప్పుకునే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా అని ఆయన ప్రశ్నించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *