KTR: రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కు అనుకూలమైన పరిస్థితి నెలకొన్నదని, ముఖ్యమంత్రిగా కె. చంద్రశేఖర రావు (కేసీఆర్) తిరిగి రావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
వికారాబాద్ జిల్లా నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాబోయే పది నుండి పదిహేను రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. వికారాబాద్లో మొత్తం ఆరు జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయని, గెలుపొందే అవకాశమున్న అభ్యర్థులకే టిక్కెట్లు ఇస్తామని స్పష్టం చేశారు.
ఎవరికి టిక్కెట్ వచ్చినా పార్టీలో ఐక్యత కావాల్సిందేనని కేటీఆర్ సూచించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని, ఒకతాటిపై నడవాలని పిలుపునిచ్చారు. అలా జరగకుంటే నష్టపోయేది తామేనని హెచ్చరించారు.
బీఆర్ఎస్ ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ, ప్రజల మనసుల్లో తన స్థానాన్ని నిలుపుకుందని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ నుంచి ఎన్నికైన ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు, ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి ఏమీ సాధించలేదని ఆయన విమర్శించారు.

