Ktr: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారం వేడెక్కుతున్న తరుణంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఢీ కొట్టారు. పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ,
“ఒకింట్లో చిన్న గొడవలు సహజం. వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవాలి. కానీ బజారున పడి కొట్లాడుకోవద్దు. మనమంతా కలిసికట్టుగా పనిచేయాలి” అని సూచించారు.
హైదరాబాద్ నగరంపై నిర్లక్ష్యం
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరం అనాథలా మారిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇటీవల వర్షాల కారణంగా ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయినా వారిని పరామర్శించేందుకు ఒక్క మంత్రి కూడా వెళ్లలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసం ముగ్గురు మంత్రులను నియమించగలిగిన ప్రభుత్వం, ప్రజల సమస్యలపై మాత్రం స్పందించలేదని నిలదీశారు.
అభివృద్ధిలో వెనుకంజ
బీఆర్ఎస్ పాలనలో 36 ఫ్లైఓవర్లు నిర్మించామని గుర్తు చేసిన కేటీఆర్, ప్రస్తుత ప్రభుత్వం రోడ్లలో గుంతలు కూడా పూడ్చలేని స్థితిలో ఉందని ఎద్దేవా చేశారు.
శాంతిభద్రతలు – నేరాల పెరుగుదల
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని, నేరాల రేటు 41 శాతం పెరిగిందని ఆరోపించారు. చందానగర్‌లో పట్టపగలే నగల దుకాణంలో జరిగిన దోపిడీ దీనికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.
ఫీజు రీయింబర్స్మెంట్ సంక్షోభం
ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించగా, బీఆర్ఎస్ కొనసాగించిందని గుర్తు చేసిన కేటీఆర్, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు లేవని చెప్పి పథకాన్ని మూసివేయడం వల్ల 13 లక్షల విద్యార్థుల భవిష్యత్తు చీకట్లోకి నెట్టబడిందని మండిపడ్డారు.
అవినీతి ఆరోపణలు
మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గన్‌మన్ ఒక లారీ యూరియాను బ్లాక్ మార్కెట్లో అమ్మిన ఘటనను ప్రస్తావించిన కేటీఆర్, గన్‌మనే ఇలా చేస్తే ఎమ్మెల్యే అవినీతి స్థాయి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని విమర్శించారు.
ఇళ్ల కూల్చివేతలు
కేసీఆర్ హయాంలో లక్ష మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వేల ఇళ్లను కూలగొట్టిందని ఆరోపించారు. “ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా?” అని ప్రశ్నించారు.