Ktr: పైనుండి ఎవరో రాసిచ్చిన ప్రశ్నలే మళ్లీ మళ్లీ అడిగారు

Ktr: ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణలో అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం అవినీతి నిరోధక శాఖ (ACB) విచారణకు హాజరయ్యారు. సుమారు 8 గంటల పాటు ఏసీబీ అధికారులు ఆయనను ప్రశ్నించారు.

విచారణ సందర్భంగా అధికారులు కేటీఆర్మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారు. అయితే, విచారణకు తాను సెల్‌ఫోన్‌ను తీసుకురాలేదని కేటీఆర్ అధికారులు స్పష్టం చేశారు. దీనితో, ఫార్ములా ఈ రేసు నిర్వహణ సమయంలో వాడిన సెల్‌ఫోన్లను ఈ నెల 18వ తేదీలోపు అప్పగించాలి అని ఏసీబీ ఆదేశించింది.

విచారణ ముగిశాక కేటీఆర్ నేరుగా తెలంగాణ భవన్‌కు చేరుకుని మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై, ఏసీబీ విచారణ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.

“ఈ కార్ రేసింగ్ వ్యవహారంపై అసెంబ్లీలో చర్చిద్దామని నేను సవాల్ విసిరాను. కానీ సీఎం రేవంత్ రెడ్డి దూరం పడ్డారు. లై డిటెక్టర్ టెస్ట్‌కి నేను సిద్ధమని చెప్పినా స్పందన లేదు,” అని కేటీఆర్ ఆరోపించారు.

అలాగే, “ఏసీబీ అధికారులు ఉదయం నుంచి అదే ప్రశ్నను పదే పదే అడిగారు. అసలు అవినీతి ఎక్కడ జరిగిందో చెప్పాలని నేను వారినే అడిగాను. పైనుండి ఎవరో రాసిచ్చిన ప్రశ్నలే మళ్లీ మళ్లీ అడిగారు” అని వ్యాఖ్యానించారు.

“రేవంత్ రెడ్డి ఒకప్పుడు జైలుకెళ్లారు. ఇప్పుడు మమ్మల్ని జైలుకి పంపించి పైశాచిక ఆనందం పొందాలని చూస్తున్నారు. నన్ను జైలుకు పెడితే విశ్రాంతి తీసుకుంటాను, కానీ భయపడను. వందల కేసులు పెట్టినా, జైలులో వేయించినా వెరవను” అని కేటీఆర్ స్పష్టంచేశారు.

 

 

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *