Ktr: తెలంగాణలో రాజకీయ భాష శైలిపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) తీవ్ర స్థాయిలో స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వరుసగా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తుండటంపై ఆయన ఘాటుగా మండిపడ్డారు.
“రాజకీయాల్లో దూషణలు మాకు ఇష్టం లేదు. కానీ, సీఎం రేవంత్ మాట్లాడుతున్న తీరు చూస్తే.. ఆయనకూ ఆయన భాషలోనే సమాధానం చెప్పాల్సిన అవసరం వస్తోంది. అందుకే మేం కూడా తిట్లు వాడక తప్పడం లేదు,” అని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
డా.బీఆర్.అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని, నైతిక విలువలను కాపాడే విధంగా రూపుదిద్దుకుందని గుర్తుచేశారు. అయితే “రాజ్యాంగాన్ని రచించినప్పుడు రేవంత్లాంటి వారు ముఖ్యమంత్రి పదవిలోకి వస్తారని అంబేద్కర్ ఊహించి ఉండరేమో” అని ఎద్దేవా చేశారు.
“అలాంటి వారిని పదవుల నుంచి రీకాల్ చేసే వ్యవస్థ ఉంటే బాగుండేదని అనిపిస్తోంది,” అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.
రాష్ట్ర రాజకీయాల్లోని గౌరవప్రదమైన సంస్కృతి పరాజయమవుతుందా అనే చర్చకు ఈ వ్యాఖ్యలు దారితీశాయి. అధికార పక్షం, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మళ్లీ వేడెక్కుతోంది.