KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తాను లేదా ఎమ్మెల్సీ కవిత ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్నారంటూ జరుగుతున్న ప్రచారాలను ఖండించారు. తమ పార్టీ తరఫున సీఎం అభ్యర్థి ఎప్పటికీ కేసీఆరేనని స్పష్టం చేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు సృష్టించడం సరికాదని ఆయన మండిపడ్డారు.
ఈ రోజు మీడియాతో మాట్లాడిన కేటీఆర్, రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి రాజకీయ పరిణామాన్ని ప్రజలు గమనిస్తున్నారని, ప్రజలు ఎప్పటికప్పుడు తమ తీర్పును ఇస్తారని తెలిపారు.
ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో ఏసీబీ తనపై నమోదు చేసిన కేసులు తప్పుడు కేసులని కేటీఆర్ అన్నారు. న్యాయనిపుణుల సూచనల మేరకు ఈడీ విచారణకు హాజరవుతానని, కానీ ఈ కేసులన్నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పన్నిన కుట్రలేనని ఆరోపించారు. తనను ఎలాగైనా అరెస్ట్ చేయాలని కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు.
అరెస్టులు, కేసులు బీఆర్ఎస్ పార్టీని భయపెట్టవని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రజల విశ్వాసం తమకుందన్న నమ్మకంతో ఇలాంటి కుట్రలను ఎదుర్కొంటామని చెప్పారు.