KTR: తెలంగాణలో జరిగే రాజకీయ వ్యవహారాలు దేశవ్యాప్తంగా ఎక్కడా చూడనివి అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా చేసిన పోస్టులో, బీజేపీ–కాంగ్రెస్ మధ్య జరుగుతున్న అవినీతిపూరిత రాజకీయ ఒప్పందాలను బహిర్గతం చేశారు.
కేటీఆర్ ఆరోపణల ప్రకారం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్‌కు చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిదికి రూ.1,137 కోట్ల విలువైన అమృత్ కాంట్రాక్టును మంజూరు చేసిందని, అదే సమయంలో రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌కు రూ.1,660 కోట్ల రోడ్డు కాంట్రాక్టును ఇచ్చిందని తెలిపారు.
“ఇంత దౌర్భాగ్యమైన రాజకీయ ఒప్పందం ఇంకొకటి ఉంటుందా?” అని ప్రశ్నించిన కేటీఆర్, తానే ఈ అవినీతిని వెలికితీయడంతో ఇద్దరూ కుడితిలో పడిన ఎలుకల్లా కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఉనికిలో లేని ‘ఫ్యూచర్ సిటీ’కి రోడ్డు వేయడం, దానికి రూ.1,660 కోట్ల కాంట్రాక్టు ఇచ్చినట్లు చెప్పడమే విడ్డూరమన్నారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూములను తాకట్టు పెట్టి రూ.10,000 కోట్లు దోచిన వ్యవహారానికి కవరుగా ఈ రోడ్డు ప్రాజెక్టు తెచ్చారని ఆరోపించారు. తాను గతంలో చెప్పినదంతా ఇప్పుడు నిజమవుతోందని పేర్కొన్నారు. బీజేపీ–కాంగ్రెస్ పార్టీలు కలిసి చేసిన ఈ దందాలు వెలుగులోకి వస్తుండటంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు పాత పంథాలో పసలేని కథలు చెబుతున్నారని విమర్శించారు.
రెవంత్ రెడ్డికి అవినీతి, నిబంధనల ఉల్లంఘనలు చక్కగా తెలిసిన విద్య అని ఎద్దేవా చేసిన కేటీఆర్, “నీ స్నేహితుడు రూ.10 వేల కోట్ల దోపిడీకి సహకరించినందుకే నీకు రిటర్న్ గిఫ్ట్‌గా రూ.1,660 కోట్ల రోడ్డు కాంట్రాక్టు ఇచ్చారు” అంటూ ఎంపీ రమేష్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ ఇరకాటంలో పడిన ప్రతిసారీ బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అయ్యే అంశాన్ని తెరపైకి తెచ్చి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. “తెలంగాణ కోసం పుట్టిన బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ ఎలాంటి పార్టీతో విలీనం కాదు” అని స్పష్టం చేశారు.
చివరగా, “సాహసముంటే సీఎం రమేష్, సీఎం రేవంత్ ఇద్దరూ కలిసి వచ్చి హెచ్‌సీయూ రూ.10 వేల కోట్ల కుంభకోణం, రూ.1,660 కోట్ల రోడ్డుపనుల అవినీతిపై మాతో బహిరంగంగా చర్చించండి” అని సవాల్ విసిరారు.


