Konda vishveshwar: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న జీఎస్టీ తగ్గింపు నిర్ణయం దేశంలోని పేద ప్రజల తలరాతను మారుస్తుందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
వ్యాపారులు–కొనుగోలుదారులకు లాభం
ఎంపీ మాట్లాడుతూ, గతంలో అధిక జీఎస్టీ కారణంగా చాలామంది వ్యాపారులు పన్ను ఎగ్గొట్టే వారని, కానీ ఇప్పుడు మోడీ ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడంతో నిజాయితీగా చెల్లించక తప్పదని తెలిపారు. ఈ నిర్ణయం వల్ల కొనుగోలుదారులపై భారం గణనీయంగా తగ్గుతుందని, దాంతో కొనుగోలు పెరిగి, ఆదాయం మరింతగా పెరుగుతుందని చెప్పారు.
మీడియా పాత్ర ప్రాముఖ్యం
జీఎస్టీ తగ్గింపు వల్ల కలిగే ప్రయోజనాలు మధ్యతరగతి, పేద ప్రజలకు ప్రతి ఒక్కరికీ తెలిసేలా మీడియా విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన కోరారు.
“రాజకీయాలు పక్కనపెట్టాలి”
అన్ని విషయాల్లో రాజకీయాలు చేయడం మానుకోవాలని, జీఎస్టీ తగ్గింపుతో ప్రజలు సంతోషంగా ఉన్నారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే, కొన్ని శక్తులు కుల, జాతి పేరుతో విభజనకు ప్రయత్నిస్తున్నాయని, నార్త్ ఇండియన్ – సౌత్ ఇండియన్ అంటూ ప్రజలను తప్పుదారి పట్టించవద్దని హెచ్చరించారు.