Kolkata: మహువా మొయిత్రా – పినాకి మిశ్రా పెళ్లి వార్తలతో రాజకీయ వర్గాల్లో చర్చ

Kolkata: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా, బీజూ జనతా దళ్ (బీజేడీ) సీనియర్ నేత, మాజీ ఎంపీ పినాకి మిశ్రా పెళ్లి చేసుకున్నారనే వార్తలు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ వివాహం జర్మనీలోని బెర్లిన్ నగరంలో సుమారు రెండు వారాల క్రితం చాలా ప్రైవేట్‌గా జరిగిందని సమాచారం. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై ఇద్దరు నేతలు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఈ వార్తలపై స్పష్టత కోసం ఓ ప్రముఖ వార్తా సంస్థ ప్రతినిధులు మహువాను సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆమె నుంచి స్పందన రాలేదని తెలిపారు.

మహువా మొయిత్రా, పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్ నుంచి రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1974లో అసోంలో జన్మించిన మహువా, రాజకీయాల్లోకి రాకముందు లండన్‌లో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా పనిచేశారు. 2010లో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన ఆమె, 2019లో తొలిసారిగా ఎంపీగా విజయం సాధించారు. 2024 ఎన్నికల్లోనూ తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు.

మరోవైపు, పినాకి మిశ్రా ఒడిశాలోని పూరీ లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన అనుభవజ్ఞుడైన రాజకీయవేత్త. ఆయన 1959లో జన్మించారు. ఢిల్లీ యూనివర్శిటీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి చరిత్రలో డిగ్రీ, ఆ తర్వాత న్యాయశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వొకేట్‌గా సేవలందిస్తున్నారు. మొదటగా కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఆయన, 1996లో ఎంపీగా గెలిచి, తర్వాత బీజేడీలో చేరారు.

ఇద్దరూ వేర్వేరు పార్టీలకు చెందినవారు కావడంతో పాటు, వయస్సులో సుమారు 15 ఏళ్ల వ్యత్యాసం ఉండటంతో ఈ పెళ్లిపై రాజకీయ వర్గాల్లో విశేష ఆసక్తి నెలకొంది. పినాకి మిశ్రా వయస్సు 65 ఏళ్లు కాగా, మహువా మొయిత్రా వయస్సు 50 ఏళ్లు. వారి పెళ్లి నిజమేనని అధికారికంగా నిర్ధారణ అయితే, ఇది దేశీయ రాజకీయాల్లో ఒక విశేషమైన సంఘటనగా మారే అవకాశముంది.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *