Kodangal: కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల పరిసర గ్రామాల్లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మళ్లీ సర్వే పేరిట గ్రామాల్లో అధికారులు రావడంతో గ్రామస్థుల్లో ఆందోళన నెలకొన్నది. భారీ ఎత్తున పోలీసులు మోహరించడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొన్నది. ఫార్మా పరిశ్రమల కోసమంటూ గతంలో భూసేకరణకు వచ్చిన అధికారులపై రైతులు దాడికి దిగిన ఘటన తీవ్ర పరిస్థితులకు దారితీసింది.
Kodangal: ఘటన అనంతరం పోలీసులు ఆయా గ్రామాలపై అర్ధరాత్రి పూట వెళ్లి పలువురిపై లాఠీలు ఝలిపిస్తూ, అరెస్టు చేశారు. సుమారు 70 మందికి పైగా ఆయా గ్రామాల రైతులు జైలు పాలయ్యారు. అంతకు ముందు కొందరు విడుదల కాగా, సుమారు 2 నెలల తర్వాత ఇటీవలే మరికొందరు విడుదలయ్యారు. ఈ లోగా లగచర్ల, ఇతర గ్రామాల రైతుల కుటుంబాలు ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో మానవ హక్కుల కమిషన్లకు, ఎస్సీ, ఎస్టీ కమిషన్లకు, న్యాయస్థానాలకు తమ సమస్యలపై మొర పెట్టుకున్నారు. దీంతో కదలిక వచ్చి రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కొంత వెనకకు తగ్గింది. ఫార్మా పరిశ్రమలు ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నది.
Kodangal: లగచర్ల సహా 5 గ్రామాల పరిధిలో పారిశ్రామిక వాడ ఏర్పాటు కోసం ఆనాడే రాష్ట్ర ప్రభుత్వం జీవోను జారీ చేసింది. ఈ మేరకు ఆయా గ్రామాల్లో భూసర్వే కోసం ఈ రోజు ఫిబ్రవరి 7న అధికారులు గ్రామాలకు వచ్చారు. తొలుత కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని దుద్యాల మండలం రోటిబండ తండాలో భూసర్వే మొదలు పెట్టారు.
Kodangal: పారిశ్రామిక వాడ ఏర్పాటు కోసం భూసర్వేకు వచ్చిన అధికారులతో పాటు వందలాది మంది పోలీసులు రోటిబండ తండాలో మోహరించారు. తమ భూములు ఇచ్చేది లేదంటూ గ్రామస్థులు నిరసన తెలుపుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు సర్వే సిబ్బంది వెంట పోలీసులు రక్షణగా నిలుస్తున్నారు. ఒకవైపు నిరసన, మరోవైపు భారీ సంఖ్యలో పోలీసు బలగాలు మోహరించడంతో ఎప్పుడేమి జరుగుతుందోనన్న ఆందోళన ఆ ఊరి ప్రజల్లో నెలకొన్నది.