Kishan reddy: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని వారం రోజులలోగా ఎన్నుకుంటారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడిన ఆయన, రాష్ట్ర అధ్యక్షుడికి ఆరెస్సెస్ నేపథ్యం ఉండాలనే నిబంధన లేదని స్పష్టంచేశారు.
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు నిర్ణయించామని కిషన్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే బూత్ కమిటీలు, మండల కమిటీలు, కొత్త సభ్యత్వాల ప్రక్రియ పూర్తయిందని వెల్లడించారు. మండల కమిటీల్లో సగానికి పైగా బీసీలకే అధ్యక్ష పదవులు అప్పగించామని, అలాగే మహిళలకు 33 శాతం పదవులు ఇస్తామని వివరించారు.
అలాగే, రేవంత్ రెడ్డి ప్రచారం చేసినంత మాత్రాన ఢిల్లీలో కాంగ్రెస్‌కు ఓట్లు పడతాయా? అంటూ ప్రశ్నించారు. ఉచితాలు వద్దని బీజేపీ ఎప్పుడూ చెప్పలేదని, కానీ రాష్ట్ర ఆదాయ వనరులను దృష్టిలో ఉంచుకుని పథకాలను అమలు చేయాలని సూచించారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు నిధులను కేటాయించామన్నారు.