Kishan reddy: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి సహకరించడం లేదన్న సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలపై కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ జి. కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. అభివృద్ధి అంటే ఏమిటో ప్రధాని మోదీని చూసి నేర్చుకోవాలని రేవంత్ రెడ్డికి సూచించారు.
తెలంగాణకు కేంద్రం చేసిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. “నీవు సిద్ధమా?” అంటూ సీఎం రేవంత్‌కు సవాల్ విసిరారు. రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని, రేవంత్ మరియు ఆయన కేబినెట్ సహచరులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.
తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవికి సంబంధించి మంగళవారం నాటికి స్పష్టత వస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలకు నోటిఫికేషన్ ఆదివారం జారీ అవుతుందని, సోమవారం నామినేషన్ల స్వీకరణ, మంగళవారం నూతన అధ్యక్షుడి ప్రకటన ఉంటుందని వెల్లడించారు. రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక ఏకగ్రీవంగా జరగాలని తాము కోరుకుంటున్నామని పేర్కొన్నారు. ఎన్నికల పరిశీలకులుగా సునీల్ బన్సల్, శోభా కర్లందాజ్ సోమవారం రాష్ట్రానికి వస్తారని, వారి సమక్షంలో నామినేషన్లు స్వీకరించబడతాయని తెలిపరు.

