Kiara Advani: పదేళ్ళ కెరీర్ లో 20 సినిమాలు చేసినా రావలసినంత గుర్తింపు అయితే రాలేదు బాలీవుడ్ భామ కియారా అద్వానీకి. తెలుగులో తొలి చిత్రం ‘భరత్ అనే నేను’ తో ఫ్లయింగ్ స్టార్ట్ లభించినా ఆ తర్వాత ‘వినయ విదేయ రామ’తో గట్టి బ్రేక్ పడింది. అటు హిందీలోనూ ‘లస్ట్ స్టోరీస్’, ‘కబీర్ సింగ్’తో లభించిన క్రేజ్ ను క్యాష్ చేసుకోలేక పోయింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలు వరుసగా అంతగా అలరించలేక పోయాయి. ఇటీవల వచ్చిన ‘సత్య ప్రేమ్ కి కథ’ కూడా నిరాశ పరిచింది. ప్రస్తుతం కియారా ‘గేమ్ ఛేంజర్, వార్2, టాక్సిక్’ వంటి భారీ బడ్జెట్ చిత్రాలతో బిజీగా ఉంది. ఇవి పక్కన పెడితే ఇటీవల ‘స్త్రీ2’తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన మడ్డోక్ ఫిలిమ్స్ ఆఫీస్ లో దర్శనమిచ్చింది కియారా. దినేశ్ విజన్ తో కలసి ఓ ప్రాజెక్ట్ చేయబోతోందట. ‘స్త్రీ2’ రిలీజ్ ముందు నుంచే చర్చలు జరుగుతున్నాయని, అతీంద్రీయ శక్తుల కథాంశంతో ఫాంటసీ సినిమాగా ఈ ప్రాజెక్ట్ రానుందట. వచ్చే ఏడాది షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమా అధికారిక ప్రకటన త్వరలో వస్తుందట. మరి రాబోయే చిత్రాలతో పాటు ఈ ఫాంటసీ సినిమాతో కియారా సత్తా చాటుతుందేమో చూద్దాం.
