TTD

TTD: టీటీడీ కీలక నిర్ణయం.. పరకామణి చోరీ ఘటనపై మళ్లీ విచారణకు తీర్మానం!

TTD: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మకర్తల మండలి సమావేశం కీలక తీర్మానాన్ని ఆమోదించింది. గతంలో సంచలనం సృష్టించిన పరకామణి చోరీ ఘటనపై మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేయాలని, ఈ కేసులో లోక్‌ అదాలత్ ద్వారా జరిగిన రాజీ వెనుక ఉన్న కుట్రదారుల పాత్రపై సమగ్ర విచారణ జరపాలని పాలకమండలి నిర్ణయించింది.

పాత కేసు పరిధిపై అభ్యంతరం

గతంలో నమోదైన కేసు విచారణ పరిధి పరిమితంగా ఉండటం, అంతేకాకుండా ఇటీవల కాలంలోనూ ఆలయంలో మరికొన్ని చోరీ ఘటనలు చోటుచేసుకోవడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని, ఈ అంశంపై మరో కొత్త కేసు నమోదు చేయాలని టీటీడీ బోర్డు తీర్మానించింది.

తీర్మానం సారాంశం:

పరకామణి చోరీ ఘటనపై తిరిగి పోలీసులకు ఫిర్యాదు చేయాలి. లోక్‌ అదాలత్ రాజీ వెనుక ఉన్న కుట్రదారులను తేల్చేలా విచారణ జరిపించాలి. గత కేసు పరిమితంగా ఉండటంతోపాటు, ఇటీవలి చోరీల దృష్ట్యా మరో కేసు నమోదు చేయాలి. ఈ తీర్మానం మేరకు, వెంటనే తిరుమల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. టీటీడీ చరిత్రలో సంచలనం సృష్టించిన ఈ చోరీ వ్యవహారంపై తిరిగి లోతైన విచారణ జరిపేందుకు బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇది కూడా చదవండి: Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు కార్మికులు మృతి

పరకామణి చోరీ కేసు: లోక్‌ అదాలత్ రాజీ వెనుక వివాదం (పూర్వ చరిత్ర)

చోరీ ఘటన (ఏప్రిల్ 2023)

నిందితుడు సి.వి. రవికుమార్, పెద్ద జీయర్ మఠం తరఫున పరకామణి (హుండీ లెక్కింపు) సేవలో పాల్గొనే గుమస్తా. అతడిని ఎలా పట్టుబడ్డారు అంటే 2023 ఏప్రిల్‌లో, రవికుమార్ భక్తులు సమర్పించిన విదేశీ కరెన్సీ (920 అమెరికన్ డాలర్లు) దొంగిలిస్తుండగా, అప్పటి టీటీడీ అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ (AVSO) సతీష్ కుమార్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దింతో సతీష్ కుమార్ ఫిర్యాదు మేరకు తిరుమల పోలీస్ స్టేషన్‌లో రవికుమార్‌పై సాధారణ దొంగతనం (తేలికపాటి సెక్షన్లు) కింద కేసు నమోదైంది.

అనూహ్యమైన రాజీ (సెప్టెంబర్ 2023)

ఈ కేసు విచారణ జరుగుతుండగానే, అనూహ్యంగా 2023 సెప్టెంబరు 9న లోక్‌ అదాలత్‌లో రవికుమార్, ఫిర్యాదుదారు సతీష్ కుమార్ మధ్య రాజీ కుదిరింది. లోక్‌ అదాలత్ ఈ రాజీని అంగీకరించి, కేసును మూసివేసింది, రవికుమార్‌ను నిర్దోషిగా విడుదల చేసింది.

ఇది కూడా చదవండి: ED Entry in IBOMMA Case: భారీగా మనీలాండరింగ్ జరిగింది..! ఐ బొమ్మ రవి కేసులో ఈడీ ఎంట్రీ

లోక్‌ అదాలత్‌లో రాజీకి ముందు, నిందితుడు రవికుమార్ తన పేరున ఉన్న రూ. 14 కోట్ల (మార్కెట్ విలువ మరింత ఎక్కువగా ఉంటుందని అంచనా) విలువైన ఆస్తులను (తిరుపతి, చెన్నైలలోని ఇళ్లు, భూములు) టీటీడీకి విరాళంగా ఇచ్చారు.

వివాదం, హైకోర్టు జోక్యం

దొంగతనం వంటి తీవ్రమైన నేరాన్ని టీటీడీ సంస్థ తరఫున ఒక అధికారి లోక్‌ అదాలత్‌లో ఎలా రాజీ చేసుకున్నారు? టీటీడీ బోర్డు అనుమతి లేకుండా ఈ రాజీ కుదరడం వెనుక ఉన్న పెద్దలు, కుట్రదారులు ఎవరు? ప్రభుత్వ ఆస్తి దుర్వినియోగం జరిగినప్పుడు కఠిన సెక్షన్లకు బదులు తేలికపాటి సెక్షన్లు ఎందుకు పెట్టారు? వంటి ప్రశ్నలు, తీవ్ర ఆరోపణలు వచ్చాయి. టీటీడీ ఈఓ కూడా, ఈ రాజీకి బోర్డు గానీ, తమ కార్యాలయం గానీ ఎటువంటి అధికారం ఇవ్వలేదని హైకోర్టుకు అఫిడవిట్‌లో తెలిపారు.

ఈ వివాదంపై దాఖలైన పిటిషన్లను విచారించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, లోక్‌ అదాలత్ ఉత్తర్వులపై అభ్యంతరం తెలిపి, ఈ కేసుపై సీఐడీ (CID) దర్యాప్తుకు ఆదేశించింది.

కేసు లో కీలక మలుపు ఫిర్యాదుదారు అనుమానాస్పద మృతి (నవంబర్ 2025)

సీఐడీ విచారణ కీలక దశకు చేరుకున్న తరుణంలో, ఈ కేసులో ఫిర్యాదుదారు, రాజీ పడిన అధికారి సతీష్ కుమార్ (అప్పటికి జీఆర్‌పీ సీఐ) రైల్వే ట్రాక్ వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

ఇది ఆత్మహత్య కాదని, పరకామణి కేసులో కీలక వివరాలు బయటపెడతారనే భయంతో హత్య చేసి ఉండవచ్చని కుటుంబ సభ్యులు, రాజకీయ నాయకులు ఆరోపించారు.

లోక్‌ అదాలత్‌లో రాజీ చేసుకోవాలని తనపై ఉన్నతాధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిందని సతీష్ కుమార్ సీఐడీ విచారణలో వెల్లడించినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలోనే, పరకామణి చోరీ ఘటనపై కుట్రదారులను తేల్చేందుకు తిరిగి కొత్త కేసు నమోదు చేయాలని టీటీడీ ధర్మకర్తల మండలి తాజాగా తీర్మానించింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *