Kethireddy Pedda Reddy Arrest: అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో తాజాగా రాజకీయ వేడి చెలరేగింది. సుమారు ఏడాది తర్వాత వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన సొంత ఊరైన తాడిపత్రిలో అడుగుపెట్టారు. ఆయన ఆకస్మికంగా తన ఇంట్లో ప్రత్యక్షం కావడంతో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
కోర్టు అనుమతితో వచ్చినా.. అరెస్ట్ చేసిన పోలీసులు
పెద్దారెడ్డికి తాడిపత్రికి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ, ఆ నిర్ణయాన్ని అధికారులు సవాలుగా తీసుకున్నారు. ఆయన ముందుగా సమాచారం ఇవ్వకుండా వచ్చినందుకు పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసే అవకాశం ఉండడంతో వెంటనే అరెస్ట్ చేసి అనంతపురం తరలించారు.
ఇది కూడా చదవండి: Hari Hara Veeramallu: హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ విడుదలపై వచ్చిన అప్”డేట్”
జేసీ వర్గీయుల వ్యతిరేకత
కేతిరెడ్డి తాడిపత్రిలోకి రావడాన్ని జేసీ వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే రాజకీయంగా ఈ రెండు వర్గాల మధ్య తీవ్ర విభేదాలు ఉన్న నేపథ్యంలో, పెద్దారెడ్డి రాక స్థానికంగా ఉద్రిక్తతకు దారి తీసే పరిస్థితి ఏర్పడింది.
మున్సిపల్ సిబ్బంది చర్యలతో వివాదం
ఇటీవల కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి మున్సిపల్ సిబ్బంది కొలతలు వేసిన నేపథ్యంలో, ఆయన తాడిపత్రికి రాక మరింత సెన్సెషన్‌గా మారింది. ఇదే సమయంలో పెద్దారెడ్డి ఇంట్లో ఉన్న సమయంలోనే పోలీసులు ఆయన్ని బలవంతంగా అదుపులోకి తీసుకోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
పోలీసుల స్పష్టత
జిల్లాలో శాంతి భద్రతల కోసం ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. ఉద్రిక్తతలు తలెత్తకుండా నియంత్రణ చర్యలు కొనసాగిస్తామని వెల్లడించారు.

