KCR: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలకు వేదికగా ఆదివారం తెలంగాణ భవన్ మారనుంది. భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) శాసనసభాపక్షం, రాష్ట్ర కార్యవర్గ సమావేశం మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కె. చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు జరగనుంది. ఈ సమావేశానికి పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జీలు సహా సుమారు 450 మంది నేతలు హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
సుదీర్ఘ విరామం తర్వాత కేసీఆర్ పార్టీ కేంద్ర కార్యాలయానికి రావడంతో ఈ భేటీకి ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. ఈ ఏడాది ఏప్రిల్ 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగిన పార్టీ రజతోత్సవ సభ తర్వాత కేసీఆర్ పాల్గొంటున్న తొలి అధికారిక పార్టీ సమావేశం ఇదే కావడం గమనార్హం. సమావేశంలో పాల్గొనేందుకు ఆయన శనివారం సాయంత్రం ఎర్రవల్లి నివాసం నుంచి హైదరాబాద్ నందినగర్‌లోని తన ఇంటికి చేరుకున్నారు.
Also Read: Christ: దేశంలోనే అత్యంత ఎత్తయిన ఏసుక్రీస్తు విగ్రహం … తెలుగు రాష్ట్రాల పక్కనే
ఈ సమావేశంలో ప్రధానంగా నదీజలాలు, సాగునీటి ప్రాజెక్టులు, తెలంగాణకు కృష్ణా, గోదావరి జలాల్లో జరుగుతున్న అన్యాయం అంశాలపై విస్తృతంగా చర్చ జరగనుంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులు తగ్గించడంపై పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ విధానాలు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ, రైతాంగ విధానాలపై కూడా కేసీఆర్ తన అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణపై పార్టీ శ్రేణులకు కేసీఆర్ స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. కృష్ణా, గోదావరి జలాలపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి సిద్ధమయ్యే అంశంపై కూడా ఈ భేటీలో చర్చించి కార్యాచరణ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. సమావేశం అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడే అవకాశం కూడా ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

