KCR: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు జూబ్లీహిల్స్ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎలాగైనా సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను అభ్యర్థిగా ఎంపిక చేసిన నాటి నుంచి నామినేషన్ల వరకూ ఆయన సునిశితంగా పరిశీలిస్తూ, ఎప్పటికప్పుడు పార్టీ కీలక నేతలకు ఆదేశాలను ఇస్తూ క్రియాశీలకంగా పనిచేస్తున్నారు.
KCR: పదేండ్లు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో కొంత కుంగుబాటుకు గురయ్యారు. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటును బీఆర్ఎస్ గెలువలేకపోవడంతో మరింత ఆందోళనకు లోనయ్యారు. అనంతరం 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. వీటితోపాటు మరికొన్ని పరిణామాలతో ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌కే కేసీఆర్ పరిమితమయ్యారు.
KCR: ఈ దశలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో బీఆర్ఎస్ ఆయన సతీమణినే పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. తాజాగా అభ్యర్థితోపాటు బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్లుగా ప్రకటించుకున్న నేతలతోపాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో క్లస్టర్ ఇన్‌చార్జులతో ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌లో కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు.
KCR: సుమారు రెండు గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై వారికి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఆరు గ్యారెంటీలు, ఇతర హామీలతో నమ్మి ఓట్లేసిన ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం తీరని ద్రోహం చేస్తున్నదని, ఇదే తరుణంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను ఇంటింటికీ తీసుకెళ్లాలని సూచించారు. కాంగ్రెస్ బాకీ కార్డును ప్రతి ఓటరుకు అర్థమయ్యేలా విడమరిచి చెప్పాలని కోరారు.
KCR: కాంగ్రెస్ పార్టీ రౌడీషీటర్‌కు టికెట్ ఇచ్చిందని, ఆయన వెంటనే ప్రచారంలో కూడా రౌడీషీటర్లు తిరుగుతున్నారని, రౌడీషీటర్ అధికారంలోకి వస్తే జరిగే నష్టాన్ని ప్రజలకు వివరించాలని బీఆర్ఎస్ ముఖ్య నేతలకు కేసీఆర్ చెప్పారు. హైడ్రా పేరుతో ప్రభుత్వం చేసిన అకృత్యాలను కళ్లకు కట్టినట్టు చూపెట్టాలని చెప్పారు. బస్తీలలో పేదలపై జరిగే అన్యాయాన్ని విడమరిచి చెప్పాలని కోరారు.
KCR: బీఆర్ఎస్ విజయం ఇప్పటికే ఖాయమైందని, మెజారిటీపైనే మీరంతా కృషి చేయాలని కేసీఆర్ కోరారు. బీఆర్ఎస్ పదేండ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చాక చేస్తున్న పథకాలపై ఓటర్లకు వివరించాలని కోరారు. ఆనాడు ఉన్న పథకాలను ఎందుకు తొలగించారని కాంగ్రెస్ నేతలను ఓటర్లు ప్రశ్నించాలని ఈ సందర్భంగా కోరారు.

