KCR: తెలంగాణ రాజకీయాలను ఊపిరి బిగపట్టేలా చేస్తున్న మరో కీలక పరిణామం – కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ ముందు హాజరయ్యేందుకు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) సిద్ధమవుతున్నట్టు సమాచారం.
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం పదేపదే విమర్శలు చేస్తూ, దాన్ని “కూలేశ్వరం”గా అభివర్ణిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరుకాలేకపోతే, “ఎందుకు హాజరుకాలేదు?” అనే ప్రశ్నలు తప్పవని బీఆర్‌ఎస్ వర్గాల్లో చర్చ సాగుతోంది.
ఇంతకు ముందు విద్యుత్ ప్రాజెక్టులపై ఏర్పాటు చేసిన కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరుకాలేదు. దాంతో, కాంగ్రెస్ పార్టీ విమర్శలకు సమాధానం ఇవ్వాలంటే ఈసారి హాజరుకావడమే మంచిదన్న అభిప్రాయంతో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే కాళేశ్వరం అంశంపై నిపుణుల అభిప్రాయాలు, సాంకేతిక విశ్లేషణలను కేసీఆర్ సమీకరిస్తున్నట్టు సమాచారం. ఈ విచారణకు హాజరయ్యే ముందు పూర్తి వివరాలు సేకరించి, తాను తీసుకున్న నిర్ణయాలను న్యాయంగా సమర్థించేందుకు సిద్ధమవుతున్నట్టు బీఆర్‌ఎస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఇదే క్రమంలో, కేసీఆర్ కుమారుడు మరియు పార్టీ కీలక నేత కేటీఆర్ జూన్ 3న అమెరికా నుంచి హైదరాబాద్‌కి తిరిగివచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. జూన్ 5న జరిగే కమిషన్ విచారణ సందర్భంగా తన తండ్రి పక్కన ఉండేందుకు ప్రత్యేకంగా ఈ ప్రయాణాన్ని ప్లాన్ చేశాడు.
ఈ పరిణామాలు అన్ని చూస్తే, బీఆర్‌ఎస్ నేతల వ్యూహాత్మక కదలికలు ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు. కమిషన్ ముందు కేసీఆర్ హాజరైతే, అది రాష్ట్ర రాజకీయాల్లో మరో మైలురాయిగా నలవనుంది.