Kaleshwaram: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్‌పై ఇండియన్ నేషనల్ డామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్ఏ) విడుదల చేసిన నివేదికపై ఎల్&టీ సంస్థ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్‌డీఎస్ఏకి పంపిన ఓ సంచలనాత్మక లేఖలో, నివేదికను తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేసింది.
పరీక్షలు చేయకుండా నివేదిక ఎలా?
ఎన్‌డీఎస్ఏ నివేదికలో మేడిగడ్డ బ్యారేజ్ వైఫల్యాన్ని చర్చించిన ఎగ్జిక్యూటివ్ సమ్మరీలో, బ్యారేజ్ పరిస్థితిని అర్థం చేసుకోవాలంటే తగిన సాంకేతిక పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అయితే అదే నివేదికలో పలు చోట్ల “గ్రౌటింగ్ కారణంగా పరీక్షలు జరగలేకపోయాయి” అని తెలిపిన నేపథ్యంలో – పరీక్షలు చేయకుండానే వ్యర్థ ప్రకటనలు ఎలా చేస్తారని ఎల్&టీ ప్రశ్నించింది.
తామే సమర్పించిన క్వాలిటీ కంట్రోల్ నివేదికపై తప్పుడు వ్యాఖ్యలు?
నివేదికలోని 283వ పేజీలో ఎల్&టీ సమర్పించిన క్వాలిటీ కంట్రోల్ నివేదిక ఉన్నప్పటికీ, అదే నివేదికలో పలుచోట్ల క్వాలిటీ పాటించలేదని ఆరోపించడం అన్యాయమని ఎల్&టీ పేర్కొంది. తాము అన్ని ప్రమాణాలను పాటించామని, తగిన ఆధారాలతో సహా నివేదికలను ముందుగానే అందించామని వివరించింది.
ఇప్పటికే లేఖ ఇచ్చాం – అయినా నిర్లక్ష్యం
ఇదివరకే మేడిగడ్డ పునరుద్ధరణపై ఎన్‌డీఎస్ఏతో పాటు నీటిపారుదల శాఖకు తాము లేఖ రాసిన విషయాన్ని గుర్తుచేస్తూ – పరీక్షలు చేయకుండానే బ్యారేజ్‌లో వైఫల్యం ఉందని పేర్కొనడాన్ని ఎల్&టీ తీవ్రంగా ఖండించింది.
సాంకేతిక స్థాయిలో వివాదం ముదిరే సూచనలు
ఈ లేఖతో మేడిగడ్డ అంశంపై సాంకేతిక స్థాయిలో కొత్త దిశలో చర్చలు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వవర్గాలు, నిర్దేశిత కమిషన్లు, ఒప్పంద సంస్థల మధ్య జరుగుతున్న ఈ చర్చలు పునః సమీక్షకు దారితీయవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.