Hyderabad: తెలంగాణ రాజకీయాల్లో మరో నూతన పరిణామానికి వేదిక సిద్ధమవుతోంది. భారతీయ రాష్ట్రీయ సమితి (బీఆర్‌ఎస్) నేతగా కొనసాగుతున్న కల్వకుంట్ల కవిత, పార్టీతో విభేదాలు తీవ్రంగా పెరిగిన నేపథ్యంలో కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్నారని విశ్వసనీయ సమాచారం.
జూన్ 2న తన రాజకీయ భవిష్యత్‌పై కీలక ప్రకటన చేయనున్నట్లు జాగృతి వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే పలు కమిటీలను ఏర్పాటు చేసిన కవిత, జాగృతి నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రజల్లోకి “బహుజన సామాజిక న్యాయం” అనే ట్యాగ్‌లైన్‌తో వెళ్ళాలని ఆమె నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే బీఆర్‌ఎస్‌లో తనకు అవసరమైన ప్రాధాన్యత లేకపోతే, తనదారి తానే చూసుకుంటానని పార్టీ అధినేత కేసీఆర్‌కు కవిత స్పష్టం చేసినట్టు సమాచారం. ఈ విషయంలో కేసీఆర్ పంపిన దూతలతో జరిగిన చర్చలు విఫలమైనట్లు తెలుస్తోంది.
రాజ్యసభ సభ్యులు దామోదర రావు, గండ్ర మోహన్ రావులతో నిన్న కవిత సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ సమావేశాల్లో పార్టీ మార్పు, భవిష్యత్తు కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.
ఈ పరిస్థితుల్లో జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కవిత తన కొత్త పార్టీ ప్రకటన చేయనున్నారు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక మలుపు అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.