Kcr: బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఈరోజు ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం తెలంగాణ ప్రజలు కష్టాల్లో ఉన్నారని, కాంగ్రెస్ హామీలను నమ్మి మోసపోయారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసలైన స్వరూపం ప్రజలకు అర్థమైందని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్‌కు ప్రజలు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
సిల్వర్ జూబ్లీ వేడుకలకు భారీ ప్రణాళిక
ఏప్రిల్ 27న బీఆర్ఎస్ పార్టీకి 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని, రాష్ట్రవ్యాప్తంగా సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా వరంగల్ జిల్లాలో లక్ష మందితో భారీ సభ నిర్వహించాలని ప్రకటించారు. త్వరలో సభా వేదికను నిర్ణయిస్తామని తెలిపారు.
పార్టీ బలోపేతానికి ప్రత్యేక చర్యలు
సిల్వర్ జూబ్లీ వేడుకల్లో మొత్తం తెలంగాణ సమాజం భాగస్వామ్యం కావాలని కోరారు. వరంగల్ సభ అనంతరం పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని, కొత్త కమిటీలను నియమించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని వెల్లడించారు. ఇందులో యువత, మహిళలకు ప్రాధాన్యత పెంచుతామని స్పష్టం చేశారు.