Kavitha: స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు కల్పించాలంటూ బీసీ ఐకాస పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్‌కు మద్దతుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఖైరతాబాద్ చౌరస్తాలో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె కాంగ్రెస్, బీజేపీ పార్టీల వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు.
రిజర్వేషన్లు ఇవ్వాల్సిన పార్టీలే డ్రామాలు!
“బీసీ బిడ్డలు తమకు రిజర్వేషన్లు కావాలని కోరుతుంటే, రిజర్వేషన్లు ఇవ్వాల్సిన బాధ్యత ఉన్న పార్టీలే బంద్‌కు మద్దతు ప్రకటించడం నవ్వులాటగా ఉంది” అని కవిత ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్‌పై విమర్శలు: “దొంగ జీవోలు” ఇచ్చి, బీసీలను పదేపదే మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి జీవో 9 విషయంలో చిత్తశుద్ధి లేదని కవిత మండిపడ్డారు. నిబంధనల ప్రకారం జనగణన నిర్వహించకపోవడం, చిత్తశుద్ధి లేకపోవడం వల్లే న్యాయస్థానం జీవోను కొట్టేసిందని ఆమె గుర్తు చేశారు. “హంతకులే వచ్చి నివాళి అర్పించినట్లు” ఈ పార్టీలు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. సర్పంచులకు బిల్లులు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు.
బీజేపీపై విమర్శలు: బీసీ బిల్లును పార్లమెంట్‌లో పాస్ చేయించాల్సిన భాధ్యత ఉన్న బీజేపీ కూడా బంద్‌కు మద్దతు పేరుతో డ్రామాలు చేస్తోందని ఆమె విమర్శించారు.
Also Read: Etala Rajender: కేసీఆర్, రేవంత్‌పై ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు
బీసీ ఉద్యమానికి పిలుపు
తెలంగాణ ఉద్యమం తరహాలో మరో బీసీ ఉద్యమాన్ని చేపట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామని కవిత హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో ప్రభుత్వాలు సాంకేతికంగా సరైన వాదనలు వినిపించకపోవడం వల్లే సుప్రీంకోర్టులో తీర్పులు వ్యతిరేకంగా వస్తున్నాయని ఆమె విమర్శించారు.
ఎన్నికల తొందర ఏముంది?
స్థానిక సంస్థల ఎన్నికలను హడావుడిగా నిర్వహించాల్సిన అవసరం లేదని కవిత అభిప్రాయపడ్డారు. “ఇప్పటికిప్పుడే ఎన్నికలు జరగాల్సినంత తొందర ఏముంది? మహారాష్ట్ర, తమిళనాడులో కూడా 5 ఏళ్ల వరకు ఎన్నికలు జరగలేదు. బీసీలకు రిజర్వేషన్ల అంశం తేలిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి” అని ఆమె డిమాండ్ చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో కవిత కుమారుడు ఆదిత్య కూడా పాల్గొని, బీసీ రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం కొనసాగించాలని డిమాండ్ చేశారు. యూనైటెడ్ ఫూలే ఫ్రంట్ కన్వీనర్ బొల్ల శివశంకర్ మాట్లాడుతూ, బీసీలను మోసం చేస్తున్న పార్టీలకు బుద్ధి చెప్పే రోజు వస్తుందని హెచ్చరించారు.