Jubilee hills: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో ఊహించని మలుపు తిరిగింది. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ జాగృతి తరఫున స్వతంత్ర అభ్యర్థిని బరిలోకి దించాలని కవిత వ్యూహరచన చేస్తోందన్న ప్రచారం గట్టి స్థాయిలో వినిపిస్తోంది.
ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే పి. విష్ణువర్థన్ రెడ్డి, సోమవారం కవితను కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దాదాపు అరగంటకు పైగా జరిగిన ఈ సమావేశంలో ఉపఎన్నిక సహా కీలక రాజకీయ అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. జాగృతి నుంచి విష్ణువర్థన్ రెడ్డి పోటీ చేసే అవకాశం దాదాపు ఖరారైనట్టేనా అన్న సందేహాలు చెలరేగుతున్నాయి. అయితే, మీడియాతో మాట్లాడిన విష్ణువర్థన్ రెడ్డి ఈ భేటీని మర్యాదపూర్వకంగా పేర్కొంటూ, కవితను దసరా వేడుకలకు ఆహ్వానించేందుకే కలిసానని స్పష్టం చేశారు.
మరోవైపు, బీఆర్ఎస్ నుంచి బహిష్కరణ తర్వాత కవిత తనకంటూ ప్రత్యేక రాజకీయ వేదికను సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం. ఈ ఏడాది బతుకమ్మ పండుగ సందర్భంగా కొత్త పార్టీ పేరును ప్రకటించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. దీంతో జూబ్లీహిల్స్ ఉపఎన్నికను కవిత తన రాజకీయ భవిష్యత్తుకు తొలి అడుగుగా మార్చుకోవాలని ప్రయత్నిస్తోందని విశ్లేషకుల అభిప్రాయం.
సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తప్పనిసరి అయింది. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండటంతో ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమయ్యాయి. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్ టికెట్ రేసులో ఉన్నారు. బీఆర్ఎస్ తరఫున మాగంటి గోపీనాథ్ భార్య సునీతను బరిలోకి దించడంపై చర్చ సాగుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు బలాన్ని చాటుకోవాలన్న లక్ష్యంతో బీజేపీ కూడా బలమైన అభ్యర్థిని వెతుకుతోంది.
ఈ నేపథ్యంలో కవిత కూడా తన అభ్యర్థిని రంగంలోకి దింపితే జూబ్లీహిల్స్ పోరు మూడు కోణాల్లో, మరింత రసవత్తరంగా సాగనుందన్నది రాజకీయ వర్గాల అంచనా.