Kavita: తెలంగాణ ప్రభుత్వాన్ని ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక డిమాండ్లు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను 40 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే నిర్వహించాలని,ఖమ్మంలో విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. బీసీలకు న్యాయం జరగాల్సిన ఈ సమయంలో కేంద్రాన్ని ఒత్తిడి చేయాలన్న ఉద్దేశంతో జూలై 17న రాష్ట్రవ్యాప్త రైల్ రోకోకు పిలుపునిచ్చారు.
ఈ ఉద్యమానికి ఖమ్మం జిల్లా ప్రజలు, బీసీ సోదరులు భారీగా స్పందించాలని ఆమె కోరారు. బీసీ హక్కుల సాధన బాధ్యతను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు భుజాన వేసుకోవాలని సూచించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామంటూ హామీలు ఇచ్చిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు.
ప్రభుత్వంపై విమర్శలు
కవిత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంపై దృష్టి పెట్టాలని, బీఆర్ఎస్ నేతలపై కక్ష సాధింపునకు పాల్పడవద్దని హెచ్చరించారు. పోలవరం–బనకచర్ల నీటి వివాదంపై ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు స్పందించాలని డిమాండ్ చేశారు.

