Tamil Nadu Stampede

Tamil Nadu Stampede: కరూర్ తొక్కిసలాటపై కేంద్రం సీరియస్… తమిళనాడు ప్రభుత్వానికి కీలక ఆదేశాలు

Tamil Nadu Stampede: తమిళనాడులోని కరూర్‌లో జరిగిన తొక్కిసలాట దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. సినీ నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ నిర్వహించిన బహిరంగ సభలో చోటుచేసుకున్న ఈ ఘోర ఘటనలో 39 మంది మృతి చెందగా, 46 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఊపిరాడక, తోపులాటలో కిందపడిపోవడం వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి దృశ్యాలు అక్కడి వాతావరణాన్ని మరింత విషాదకరంగా మార్చేశాయి.

కేంద్ర హోంమంత్రిత్వ శాఖ స్పందన

ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, సహాయక చర్యలపై పూర్తి స్థాయి నివేదికను తక్షణమే సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

రాష్ట్ర ప్రభుత్వ చర్యలు

సమాచారం అందుకున్న వెంటనే రాష్ట్ర మంత్రులు అన్బిల్ మహేశ్ పొయ్యమొళి, మా సుబ్రమణియన్ కరూర్ చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. గాయపడిన వారిని కరూర్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉండడంతో వారికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రి ప్రాంగణంలో బాధితుల బంధువుల రోదనలు హృదయాన్ని కలిచివేస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Swami Chaitanyananda: స్వామి చైతన్యానంద సరస్వతి అరెస్ట్‌..!

ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ బాధిత కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 1 లక్ష ఆర్థిక సహాయం ప్రకటించారు. త్వరలోనే కరూర్ చేరుకుని బాధితులను పరామర్శించనున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా భవిష్యత్ రాజకీయ సభల్లో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయనున్నట్లు అధికారులను ఆదేశించారు.

ప్రధాని మోడీ సానుభూతి

ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ప్రత్యక్ష సాక్షుల వర్ణన

సభలో ఒక్కసారిగా జన సమూహం ముందుకు తోసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. భద్రతా ఏర్పాట్లలో లోపాలు ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ సంఘటనపై పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించగా, అదనపు డీజీపీ డేవిడ్సన్ దేవశిర్వతం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ సభల్లో ఇది అతి పెద్ద విషాదంగా నిలిచింది. ఈ ఘటన భవిష్యత్తులో సభల నిర్వహణపై కీలక పాఠం నేర్పే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *