Kartika Purnima

Kartika Purnima: కార్తీక పౌర్ణమినాడు ఉసిరి దీపం ఎందుకు..? విశిష్టత.. మొదట ఎవరు వెలిగించారో తెలుసా..!

Kartika Purnima: శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో దీపారాధనకు విశేష ప్రాధాన్యం ఉంది. ఈ నెల రోజులు శివాలయాల్లో 365 వత్తుల దీపం, ముఖ్యంగా ఉసిరి కాయ దీపం (ఆమ్లా దీపం) వెలిగించడం అనాదిగా వస్తున్న ఆచారం. ఈ దీపం వెలిగించడం వెనుక ఉన్న పురాణ నేపథ్యం ఏమిటి, దీని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఏమిటో పండితులు, పురాణాల ఆధారంగా తెలుసుకుందాం.

ఉసిరి దీపం ప్రాధాన్యత: పురాణాలు ఏం చెబుతున్నాయి?

స్కంద పురాణం ప్రకారం, ఉసిరి చెట్టులో సాక్షాత్తు శివకేశవులతో పాటు బ్రహ్మ మరియు సకల దేవతలు నివసిస్తారు. అందుకే కార్తీక మాసంలో ఉసిరికాయకు అత్యంత ప్రత్యేక స్థానం ఉంది.

కార్తీక మాసంలో ముఖ్యంగా సోమవారాలు, ఏకాదశి మరియు పౌర్ణమి తిథుల్లో ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దీపం వెలిగించడం వల్ల గొప్ప ప్రయోజనాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు.

ఉసిరి దీపం వెలిగించిన ద్రౌపది – పౌరాణిక కథ

పద్మ పురాణం ఆధారంగా వశిష్ఠ మహాముని శౌనకాది మునులకు ఈ ఉసిరి దీపం వెలిగించడం గురించి ఒక కథను వివరించాడు. పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో కార్తీక మాసంలో శివుడిని పూజించాలని కోరుకున్నారు, కానీ వారికి శివలింగం అందుబాటులో లేదు.

అప్పుడు శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఉపదేశిస్తూ, ప్రస్తుతం మీరు, మీ భర్తలు గ్రహాల చెడు ఫలితాల వల్ల జూదంలో ఓడిపోయి బాధపడుతున్నారని తెలిపాడు. కార్తీక మాసంలో ఉసిరి, ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే నవగ్రహ దోషాలు పరిహారమవుతాయని పద్మపురాణం చెబుతోంది.

ఇది కూడా చదవండి: Earthquake: ఇండోనేషియాలో మరోసారి భూకంపం.. 6.2గా తీవ్రత నమోదు

ఈ ఉపదేశంతో ద్రౌపది ఒక గుండ్రని ఉసిరి కాయ పైభాగాన్ని తీసివేసి, అందులో ఆవు నెయ్యి, తెల్లటి వత్తులతో దీపారాధన చేసింది. ఈ విధంగా ఉసిరి దీపం మొదట వెలిగించినది ద్రౌపదే అని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. ఈ దీపం వెలిగించిన తర్వాతే పాండవులకు దుష్ట శక్తులు దూరమై, తిరిగి రాజ్యానికి రావడానికి బీజం పడినట్లు పండితులు చెబుతున్నారు.

ఉసిరి దీపం ఎలా వెలిగించాలి?

ఉసిరి కాయను గుండ్రంగా కత్తిరించి, దాన్ని దీపంలా ఉపయోగించి ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తారు.కార్తీక పౌర్ణమి రోజున గుండ్రంగా ఉండే ఉసిరికాయను తీసుకుని, మధ్యలో దీపంలా ఉండేందుకు వీలుగా కట్ చేయాలి.ఆ బెజ్జంలో ఆవు నెయ్యి నింపి, అందులో తామర పువ్వుల వత్తులు వేసి దీపం వెలిగించాలి. ఈ విధంగా వెలిగించిన ఉసిరి దీపాలను అరటి దోనెల్లో పెట్టి నీటిలో వదులుతారు.

ఉసిరి దీపం వల్ల కలిగే ప్రయోజనాలు

ఉసిరి కాయను లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనదిగా భావిస్తారు. కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దీపం వెలిగిస్తే నరదిష్టితో పాటు సకల నవగ్రహ దోషాలు తొలగిపోతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

ఉసిరి దీపం ఇలా వెలిగిస్తే శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవి సంతోషిస్తారు.సకల సంపదలు చేకూరుతాయి. మహిళలు సుఖసంతోషాలతో ఉంటారని, సౌభాగ్యం కలుగుతుందని అంటారు.కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం కూడా శుభప్రదమని నమ్ముతారు.

Disclaimer: (ఈ కథనంలోని సమాచారం కేవలం పురాణాలు, పండితుల సలహాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించబడింది. దీని ఖచ్చితత్వాన్ని ధృవీకరించడానికి దయచేసి మీ ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించండి.)

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *