Siddaramaiah: పర్యావరణ పరిరక్షణ, స్థానిక పరిశ్రమలకు ప్రోత్సాహం లక్ష్యంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మరియు అధికారిక సభలు, కార్యక్రమాలలో ప్లాస్టిక్ నీళ్ల సీసాల వినియోగాన్ని తక్షణమే నిషేధిస్తూ ముఖ్యమంత్రి ఉత్తర్వులు ఇచ్చారు. ప్రభుత్వ కార్యాలయాలు, సమావేశాలు మరియు అధికారిక కార్యక్రమాలలో తాగునీటి కోసం ప్లాస్టిక్ బాటిళ్లకు బదులుగా పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను మాత్రమే ఉపయోగించాలని సీఎం ఆదేశించారు.
ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించి, సుస్థిరత వైపు ప్రభుత్వం అడుగులు వేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు, అన్ని ప్రభుత్వ విభాగాలలో జరిగే సమావేశాలు, కార్యక్రమాలలో తప్పనిసరిగా ప్రభుత్వ యాజమాన్యంలోని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (KMF) కు చెందిన ‘నందిని’ ఉత్పత్తులను మాత్రమే ఉపయోగించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇది పర్యావరణ బాధ్యతను పెంచడంతో పాటు, రాష్ట్రంలోని స్థానిక సంస్థలు మరియు రైతులకు మద్దతుగా నిలుస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ ఆదేశాలను అన్ని శాఖల అధికారులు కచ్చితంగా పాటించాలని సీఎం సిద్ధరామయ్య ఆదేశించారు.

