Crime News: కరీంనగర్ జిల్లా వావిలాలపల్లిలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. మానసిక వైకల్యంతో బాధపడుతున్న కొడుకు (17), కూతురు (15)లను కన్నతండ్రే చంపడానికి ప్రయత్నించాడు. తండ్రి ఘాతుకానికి కూతురు అర్చన చికిత్స పొందుతూ మరణించగా, కొడుకు ఆశ్రిత్ పరిస్థితి విషమంగా ఉంది.
విషాదకరమైన ఘటన వివరాలు
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం వెంకటరావుపేటకు చెందిన మల్లేశం, పోచమ్మ దంపతులు ఏడేళ్లుగా కరీంనగర్‌లోని వావిలాలపల్లిలో నివాసం ఉంటున్నారు. వారిద్దరు సంతానం మానసిక అంగవైకల్యంతో బాధపడుతున్నారు.
నిన్న (శనివారం) సాయంత్రం భార్య పోచమ్మ ఏదో పని నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో మల్లేశం ఈ దారుణానికి ఒడిగట్టాడు. ముందుగా మజా కూల్ డ్రింక్‌లో విష పదార్థాలు కలిపి పిల్లలిద్దరికీ ఇచ్చాడు. ఆ తర్వాత వారి గొంతు నులిమి చంపడానికి ప్రయత్నించాడు. పిల్లలిద్దరూ అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత, మల్లేశం వెంటనే ఇంటి నుంచి పరారయ్యాడు.
ఇది కూడా చదవండి: Black Coffee: మార్నింగ్ బ్లాక్ కాఫీ తాగుతున్నారా.. బెనిఫిట్స్ తో పాటు నష్టాలు కూడా ఉన్నాయి
తల్లి పోరాటం, కూతురు మృతి
పని ముగించుకుని ఇంటికి వచ్చిన తల్లి పోచమ్మ, కొడుకు, కూతురు అపస్మారక స్థితిలో ఉండటం చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. స్థానికుల సహాయంతో వెంటనే వారిని ఆసుపత్రిలో చేర్పించారు. అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కూతురు అర్చన (15) మృతి చెందింది. కొడుకు ఆశ్రిత్ (17) పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు.
ఘాతుకానికి కారణం అదేనా?
ఈ ఘాతుకానికి పాల్పడిన మల్లేశం ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల ప్రాథమిక అనుమానం ప్రకారం ఇద్దరు పిల్లలు మానసిక అంగవైకల్యంతో బాధపడుతుండటం, వారిని పోషించడం ఇబ్బందిగా మారడంతోనే తండ్రి మల్లేశం ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చు అని పోలీసులు పేర్కొంటున్నారు.
ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడు మల్లేశం కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ దారుణం స్థానికంగా తీవ్ర విషాదాన్ని, కలకలాన్ని సృష్టించింది.

