Virat vs Kane: న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అంతర్జాతీయ వన్డేల్లో చరిత్ర సృష్టించారు. అత్యంత వేగంగా 7,000 పరుగులు సాధించిన రెండవ బ్యాట్స్‌మన్‌గా నిలిచారు, అందులో భాగంగా టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ రికార్డ్‌ను అధిగమించారు. సౌతాఫ్రికాతో జరిగిన ముక్కోణపు సిరీస్ మ్యాచ్‌లో కేన్ సెంచరీ చేసి ఈ సాధన సాధించారు.
న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ కెన్ విలియం సన్ ఒక గొప్ప ఘనతను సాధించాడు. ఇప్పటివరకు 159 ఇన్నింగ్స్‌లలో 7,000 పరుగులు చేసిన కేన్ భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఈ మైలురాయిను అందుకోవడానికి, తీసుకున్న 161 ఇన్నింగ్స్‌ల రికార్డుని అధిగమించాడు. ఇక సౌత్ ఆఫ్రికా కుడి చేతి బ్యాటర్ హషిమ్ ఆమ్లా 151 ఇన్నింగ్స్‌లలో ఈ సాధనతో అగ్రస్థానంలో ఉన్నారు. ఏబీ డివిలియర్స్ (161), సౌరవ్ గంగూలీ (174), రోహిత్ శర్మ (181) వంటి వారు తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
న్యూజిలాండ్ తరఫున వన్డేల్లో 7,000 పరుగులు సాధించిన ఐదవ బ్యాట్స్‌మన్‌గా కేన్ విలియమ్సన్ నిలిచారు. అతని ముందు రాస్ టేలర్, స్టీఫెన్ ఫ్లెమింగ్, మార్టిన్ గప్టిల్, నాథన్ ఆస్ట్లే ఈ మైలురాయిని దాటారు. దాదాపు ఐదేళ్ల తర్వాత కేన్ విలియమ్సన్ వన్డేలో సెంచరీ సాధించాడు. పాకిస్తాన్ లో జరుగుతున్న ముక్కోణపు సిరీస్ లో 113 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 133 పరుగులు చేసి అజేయంగా నిలిచి న్యూజిలాండ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు విలియమ్సన్.. ఈ గెలుపుతో న్యూజిలాండ్ ముక్కోణపు సిరీస్ ఫైనల్ చేరుకుంది.
Also Read: Ram Charan: రీ రిలీజ్ లో దుమ్ములేపుతున్న రామ్ చరణ్ డిజాస్టర్ సినిమా!
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 50 ఓవర్లలో 6 వికెట్లకు 304 పరుగులు చేసింది. మాథ్యూ బ్రీట్జ్‌కే అరంగేట్రంలోనే 148 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స్‌లతో 150 పరుగులు చేసి విధ్వంసకర శతకం చేశాడు, వియాన్ మల్డర్ 60 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 64 పరుగులు చేశారు. అరంగేట్ర వన్డేలో 150 పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా మాథ్యూ బ్రీట్జ్‌కే చరిత్రకెక్కాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, విల్ ఓ రూర్కీ రెండు వికెట్లు పడగొట్టగా, మైఖేల్ బ్రేస్‌వెల్ ఒక వికెట్ తీసారు.
తర్వాత న్యూజిలాండ్ 48.4 ఓవర్లలో 4 వికెట్లకు 308 పరుగులు చేసి గెలుపొందింది. కేన్ విలియమ్సన్ అజేయ శతకంతో రాణిస్తే, డెవాన్ కాన్వే 107 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 97 పరుగులు చేసి సెంచరీని చేజార్చుకున్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో ముతుసామి రెండు వికెట్లు తీసారు, జూనియర్ డాలా, ఎథన్ బోస్చ్ ఒక్కో వికెట్ తీశారు. బుధవారం సౌతాఫ్రికాతో పాకిస్థాన్ చివరి మ్యాచ్ ఆడనుంది. ఆ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో ఫిబ్రవరి 14న కివీస్ తో ఫైనల్ ఆడనుంది.