Kavitha: బీఆర్‌ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె, పార్టీ లోపల జరుగుతున్న రాజకీయ పరిణామాలను ఎండగట్టారు. తనపై పన్నిన కుట్రలపై సూటిగా వ్యాఖ్యానించిన కవిత, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తన అన్న కేటీఆర్‌ను బహిరంగంగా ప్రశ్నించారు.
“కేటీఆర్‌ను గడ్డం పట్టుకుని అడుగుతున్నా… నాపై కుట్రలు జరుగుతుంటే వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న మీరు ఏం చేశారు?” అంటూ కవిత సూటి ప్రశ్నలు సంధించారు. పార్టీ మహిళా నేతలు కూర్చొని తనపై ప్రెస్‌మీట్ పెట్టడం వెనుక కూడా రాజకీయ కుట్రలు ఉన్నాయని ఆమె ఆరోపించారు. “మా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడమే కొందరి లక్ష్యం. నేడు నన్ను బయటకు నెట్టారు, రేపు ఇదే పరిస్థితి కేటీఆర్‌కి, కేసీఆర్‌కి ఎదురవుతుంది” అని వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Kavitha: రేవంత్ రెడ్డి , హరీష్ రావు, కలిసే..నాపై కుట్రలు జరుపుతున్నారు..
తనపై తప్పుడు ప్రచారం ఆపాలని కేటీఆర్‌ను కోరినా స్పందన రాలేదని ఆమె వాపోయారు. “103 రోజులైనా కేటీఆర్ అడగలేదు, విచారణ జరగలేదు. తీహార్ జైలులో ఐదున్నర నెలలు గడిపి బయటకొచ్చాకా కూడా పార్టీ కోసం నిరంతరం కష్టపడ్డాను. ప్రజా సమస్యలపై పోరాడటం పార్టీ వ్యతిరేకమా?” అని ప్రశ్నించారు.
కవిత మాట్లాడుతూ, తండ్రి కేసీఆర్‌నే రాజకీయ పాఠాలు నేర్పారని గుర్తుచేశారు. “కేసీఆర్ నుంచి నేర్చుకున్న సామాజిక తెలంగాణ ఎజెండానే ఇప్పటికీ నడిపిస్తోంది. కానీ, పార్టీ లోపల కొందరు నేతలు చిలువలు పలువలుగా నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. నన్ను బయటకు నెట్టేసి పార్టీని అస్తవ్యస్తం చేయాలన్న యత్నం స్పష్టంగా కనిపిస్తోంది” అని విమర్శలు గుప్పించారు.