Crime News

Crime News: కలిసి జీవించలేక.. మరణంలో విడిపోలేక.. కడపలో ప్రేమ జంట ఆత్మహత్య

Crime News: కడప జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. చిన్నప్పటి నుండి స్నేహితులుగా ఉండి, పెళ్లి పీటల వరకు వెళ్లాలని కలలుగన్న ఓ ప్రేమ జంట మనస్పర్థల కారణంగా బలవన్మరణానికి పాల్పడింది. చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీనగర్‌కు చెందిన యోగేంద్ర కుమార్ వర్మ (19), కడప నగరంలోని గోదిన వీధికి చెందిన హేమశ్రీ (19) సోమవారం వేర్వేరు ప్రాంతాల్లో ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచారు.

ప్రేమలో గెలిచినా, చిన్నపాటి మనస్పర్థల దగ్గర ఓడిపోయిన ఈ జంట కథ విషాదంగా ముగిసింది. యోగేంద్ర, హేమశ్రీలు చిన్నప్పటి నుండి కలిసి పెరిగిన స్నేహితులు. వారి స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ప్రస్తుతం వీరిద్దరూ కడపలోని ఒకే ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. అందరిలాగా ఇంట్లో నుండి పారిపోయి పెళ్లి చేసుకోవాలని వారు అనుకోలేదు. కష్టపడి చదువుకుని, జీవితంలో ఒక మంచి స్థాయికి చేరుకున్నాకే పెద్దల అంగీకారంతో ఒక్కటవ్వాలని నిశ్చయించుకున్నారు.

ఆ ఒక్క ఫోన్ కాల్.. రెండు ప్రాణాలు

గత ఆదివారం (మే 3) కడపలో జరిగిన ఒక బంధువు పెళ్లికి ఈ జంట హాజరైంది. పెళ్లి ముగిసిన తర్వాత యోగేంద్ర తన అత్తగారింటికి వెళ్లగా, హేమశ్రీ తన ఇంటికి చేరుకుంది. అయితే, ఆ రాత్రి ఫోన్ సంభాషణలో వీరిద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగినట్లు తెలుస్తోంది. తీవ్ర మనస్తాపానికి గురైన యోగేంద్ర, బంధువుల ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

మరణంలోనూ వీడని బంధం

యోగేంద్ర మరణవార్త విన్న హేమశ్రీ తట్టుకోలేకపోయింది. తన ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి ఇక లేడనే వార్త ఆమెను కుంగదీసింది. సోమవారం ఉదయం ఆమె కూడా తన నివాసంలో ఉరివేసుకుని తనువు చాలించింది. వీరిద్దరి మరణం ఇరు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది.

జీవించి ఉన్నప్పుడు కలవలేకపోయినా, మరణంలోనైనా వారిని విడదీయకూడదని ఇరు కుటుంబ సభ్యులు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. కులమతాలు, పట్టింపుల కంటే తమ బిడ్డల ప్రేమే గొప్పదని భావించి, యోగేంద్ర మరియు హేమశ్రీలకు ఒకే చోట అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమ యాత్రలో ఆ జంటను పక్కపక్కనే సాగనంపుతుంటే స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు.

చిన్నపాటి కోపం, క్షణికావేశం రెండు నిండు ప్రాణాలను బలితీసుకోవడమే కాకుండా, రెండు కుటుంబాల్లో వెలుగులు ఆర్పేశాయి. చిన్న సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోలేక ఈ జంట తీసుకున్న నిర్ణయం అందరినీ కలచివేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *