Dario Amodei: క్యాన్సర్, అల్జీమర్స్, హార్ట్ ఎటాక్స్, డిప్రెషన్ లాంటి భయంకరమైన రోగాలు మరో పదేళ్లలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయా? మనం హాస్పిటల్స్ చుట్టూ తిరిగే బాధలు శాశ్వతంగా తీరిపోనున్నాయా? వినడానికే ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా స్టోరీలా ఉంది కదా! కానీ, ప్రపంచంలోనే టాప్ ఏఐ కంపెనీల్లో ఒకటైన ఆంథ్రోపిక్ (Anthropic – క్లాడ్ ఏఐ సృష్టికర్త) సీఈఓ డారియో అమోడెయ్ రీసెంట్గా చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) దెబ్బకు మెడికల్ హిస్టరీ మొత్తం మారిపోతుందని టెక్ దిగ్గజాలు చెప్తుంటే.. క్షేత్రస్థాయిలో అసలైన మందులు తయారుచేసే ఫార్మా కంపెనీలు, డాక్టర్లు మాత్రం “ఆపండయ్యా మీ బిల్డప్‌లు.. సైన్స్ అంటే కంప్యూటర్ కోడింగ్ కాదు!” అంటూ గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు.
ఇది అద్భుతాల యుగం.. టెక్ బాసుల భారీ హామీలు
డారియో అమోడెయ్ రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏఐ పవర్‌పై భారీ స్టేట్మెంట్ ఇచ్చారు. మరో పదేళ్లలోపు క్యాన్సర్, అల్జీమర్స్, గుండె జబ్బులు, మానసిక అనారోగ్యాలు కేవలం పాత జ్ఞాపకాలుగా (గత చరిత్రగా) మిగిలిపోతాయి. మనం సరైన రూట్లో పనిచేస్తే.. వేల ఏళ్లుగా మానవాళిని పట్టిపీడిస్తున్న రోగాలన్నింటినీ నయం చేసే ఒక మిరాకిల్ యుగాన్ని సృష్టించవచ్చు అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కేవలం డారియో మాత్రమే కాదు.. గూగుల్ డీప్‌మైండ్ బాస్ డెమిస్ హసాబిస్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కూడా ఇదే చెపుతున్నారు. కొత్త మెడిసిన్ కనుగొనడానికి పట్టే పదేళ్ల రీసెర్చ్ టైమ్‌ను ఏఐ కేవలం కొన్ని వారాలకే కుదించేస్తుందని హసాబిస్ అన్నారు. అందుకు ఉదాహరణగా 20 కోట్లకు పైగా ప్రొటీన్ల స్ట్రక్చర్లను చిటికెలో కనిపెట్టిన ‘ఆల్ఫాఫోల్డ్’ (AlphaFold) టూల్‌ను చూపిస్తున్నారు.
ఎలాన్ మస్క్ అయితే ఒక అడుగు ముందుకేసి.. అమెరికా అధ్యక్షుడికి దక్కే వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ రాబోయే రోజుల్లో ఏఐ పుణ్యమా అని ప్రపంచంలో ఉన్న ప్రతి సామాన్యుడికీ అందుబాటులోకి వస్తుందని చెప్పుకొచ్చారు.
ఫార్మా సైంటిస్టుల రియాక్షన్.. కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తే సరిపోదు!
టెక్ లీడర్లు చెప్తున్న ఈ ముచ్చట్లను ఫార్మా రంగ నిపుణులు ఏమాత్రం నమ్మడం లేదు. ప్రముఖ ఫార్మా దిగ్గజం వెర్టెక్స్ ఫార్మాస్యూటికల్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ జెఫ్ లీడెన్ అయితే ఈ అంచనాలను పూర్తిగా కొట్టిపారేశారు..
దాదాపు 10,000 డ్రగ్ కాంపౌండ్స్‌ను రీసెర్చ్ చేయడానికి మేము సుమారు 50 ప్రముఖ ఏఐ కంపెనీల టెక్నాలజీని టెస్ట్ చేశాం. కానీ, వాటిలో ఏ ఒక్క ఏఐ కూడా సొంతంగా పనిచేసే ఒక్క డ్రగ్‌ను కూడా తయారు చేయలేకపోయింది అని ఆయన తేల్చిచెప్పారు.
కంప్యూటర్లో గ్రాఫిక్స్ ఈజీనే.. రియాలిటీ వేరు: ఒక మందు తయారీలో కంప్యూటర్ స్క్రీన్ మీద మాలిక్యూల్ (అణువు) డిజైన్ కావడం అనేది కేవలం మొదటి అడుగు (స్టెప్ 1) మాత్రమే. అక్కడితో అయిపోదు. అది ప్రయోగశాలల్లో (ల్యాబ్స్), జంతువులపై, ఆ తర్వాత రకరకాల స్టేజీల్లో మనుషులపై క్లినికల్ ట్రయల్స్ (Phase 1, 2, 3) జరగాలి.
ఔషధం వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తున్నాయా? అది సేఫేనా? అని చూడటానికి, ప్రభుత్వ డ్రగ్ కంట్రోలర్ల అనుమతులు రావడానికే సాధారణంగా 10 నుంచి 12 ఏళ్లు పడుతుంది. ఈ హ్యూమన్ బాడీ టెస్టుల ప్రాసెస్‌ను ఏఐ టెక్నాలజీ ఒక్క రాత్రిలో ఎగరగొట్టలేదు కదా!
1970ల నాటి సీన్ రిపీట్ అవుతోందా?
ప్రముఖ సైంటిస్ట్ గ్యారీ మార్కస్, డిజిటల్ మెడిసిన్ ఎక్స్పర్ట్ ఎరిక్ టోపోల్ వంటి నిపుణులు కూడా ఏఐ పరిమితులను ఎత్తిచూపుతున్నారు. ప్రస్తుత ఏఐ మోడల్స్‌కు మానవ శరీర సంక్లిష్టత, జీవశాస్త్రంలోని లోతైన కారణాలపై పూర్తి అవగాహన లేదు. ఇప్పటివరకు పూర్తిగా ఏఐ డిజైన్ చేసిన ఒక్క మెడిసిన్ కూడా పూర్తిస్థాయిలో మార్కెట్లోకి వచ్చి రోగులను కాపాడిన దాఖలాలు లేవు.
గతంలో 1970లలో కూడా ‘వార్ ఆన్ క్యాన్సర్’ పేరుతో కొన్నేళ్లలోనే క్యాన్సర్‌ను అంతం చేస్తామంటూ ఇలాగే గొప్పలు చెప్పారు. కానీ దశాబ్దాలు గడిచినా ఆ డెడ్లైన్లు అందుకోలేకపోయారు. ఇప్పుడు ఏఐ పేరుతో సైన్స్ సాధించలేని అవాస్తవ అంచనాలను జనాల్లో పెంచడం సరికాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
