Air Pollution: కాలుష్యం పెరిగిపోతే జలుబు, దగ్గు, గొంతు గరగర, శ్వాస ఆడకపోవడం లాంటి సమస్యలే వస్తాయని ఎక్కువమంది అనుకుంటారు. కానీ గాలిలో పెరిగే తీవ్రమైన కాలుష్యం నేరుగా గుండె మీద విపరీతమైన ఒత్తిడి తెచ్చి హార్ట్ ఎటాక్‌కు కూడా దారితీయొచ్చని మీకు తెలుసా? ముఖ్యంగా గాల్లో ఉండే అతి సూక్ష్మ ధూళికణాలు (PM2.5) రక్తనాళాలను దెబ్బతీసి గుండెపోటు ముప్పును ఒక్కసారిగా పెంచుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఢిల్లీలోని సీకే బిర్లా హాస్పిటల్ కార్డియాలజీ డైరెక్టర్ డాక్టర్ అన్షుల్ కుమార్ జైన్.. గాలి కాలుష్యం మన గుండెను ఎలా దెబ్బతీస్తుందనే దానిపై పలు కీలక విషయాలను వెల్లడించారు.
ఊపిరితిత్తుల నుంచి నేరుగా రక్తంలోకి.. అసలేం జరుగుతుంది?
డాక్టర్ జైన్ వివరించిన వివరాల ప్రకారం..
-
రక్తంలోకి ప్రవేశించే కాలుష్యం: మనం పీల్చే విషపూరిత గాలిలోని సూక్ష్మ రేణువులు (PM2.5) ఊపిరితిత్తుల ద్వారా నేరుగా రక్త ప్రవాహంలోకి చేరతాయి.
-
రక్తనాళాల డ్యామేజ్: ఇవి రక్తంలో ఆక్సిడేటివ్ ఒత్తిడిని, అంతర్గత వాపును (Inflammation) కలిగిస్తాయి. దీనివల్ల రక్త ప్రసరణను సాఫీగా సాగేలా చూసే రక్తనాళాల లోపలి పొర (Endothelium) దెబ్బతింటుంది. ఫలితంగా రక్తనాళాలు తమ సహజమైన సాగే గుణాన్ని కోల్పోయి గట్టిపడతాయి.
-
హార్ట్ రేట్, బీపీ పెరుగుదల: కాలుష్య కారకాలు శరీరంలోని ఒత్తిడి వ్యవస్థను (Sympathetic Nervous System) ఉత్తేజితం చేస్తాయి. దీంతో గుండె కొట్టుకునే వేగం, రక్తపోటు (బీపీ) ఒక్కసారిగా పెరిగి గుండెపై భారం తీవ్రమవుతుంది.
-
బ్లడ్ క్లాట్స్ & హార్ట్ ఎటాక్: గుండె రక్తనాళాల్లో ఇప్పటికే పేరుకుపోయిన కొవ్వు నిల్వలు (Atherosclerotic Plaques) ఈ వాపు వల్ల చిట్లిపోయే ప్రమాదం ఉంది. అలా చిట్లిన చోట రక్తం గడ్డకట్టి (Blood Clot), గుండెకు రక్తం సరఫరా కాకుండా ఆగిపోయి సడెన్ కార్డియాక్ అరెస్ట్ లేదా హార్ట్ ఎటాక్ వస్తుంది.
ఎవరికి రిస్క్ ఎక్కువ?
కాలుష్య తీవ్రత పెరిగినప్పుడు అందరి శరీరంలోనూ కొంత ఒత్తిడి ఏర్పడినప్పటికీ.. కొందరికి ఇది ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది..
-
వృద్ధులు, ఇప్పటికే గుండె జబ్బులు ఉన్నవారు.
-
హై బీపీ (Hypertension), డయాబెటిస్ (షుగర్), అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు.
-
గతంలో ఇప్పటికే హార్ట్ ఎటాక్ వచ్చిన పేషెంట్లు అత్యంత జాగ్రత్తగా ఉండాలి.
నిర్లక్ష్యం చేయకూడని ప్రమాదకర లక్షణాలు..
కాలుష్యం ఎక్కువగా ఉన్న రోజుల్లో కింది లక్షణాలు కనిపిస్తే గ్యాస్ ట్రబుల్ అని లైట్ తీసుకోకుండా వెంటనే ఎమర్జెన్సీ డాక్టర్‌ను సంప్రదించాలి:
-
ఛాతీలో విపరీతమైన నొప్పి, పట్టేసినట్లు లేదా బరువుగా అనిపించడం.
-
శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది.
-
కారణం లేకుండా చల్లటి చెమటలు పట్టడం, కళ్లు తిరగడం.
-
ఛాతీ నుంచి నొప్పి ఎడమ చేతికి, దవడకు లేదా వెనుక వీపు భాగానికి పాకడం.
గుండెను కాపాడుకోవడానికి ఏం చేయాలి?
-
ఉదయం, సాయంత్రం బయటకు వెళ్లొద్దు: కాలుష్యం గరిష్ఠ స్థాయిలో ఉండే వేళల్లో రోడ్లపై జాగింగ్, వాకింగ్ లేదా కఠినమైన వర్కౌట్లు చేయకపోవడమే మంచిది.
-
N95 మాస్క్ వాడండి: అత్యవసర పనులపై బయటకు వెళ్లాల్సి వస్తే సాధారణ క్లాత్ మాస్కులు కాకుండా సరిగ్గా సరిపోయే N95 మాస్క్ ధరించాలి.
-
ఇంటి లోపల గాలి శుభ్రత: ఇళ్లలో ఎయిర్ ప్యూరిఫైయర్లు వాడటం, దుమ్ము చేరకుండా తలుపులు సరిగ్గా మూసి ఉంచడం మంచిది.
-
నిరంతర మానిటరింగ్: రిస్క్ కేటగిరీలో ఉన్నవారు బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ లెవల్స్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ డాక్టర్ సూచించిన మెడిసిన్లను క్రమం తప్పకుండా వాడాలి.
(గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి ఆరోగ్య సమస్యలకైనా వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం).
