Kangana Ranaut

Kangana Ranaut: గాంధీ కుటుంబంలోకి ఆ విదేశీ మహిళ రాక ఓ మిస్టరీ.. సోనియాపై కంగనా రనౌత్ సంచలన కామెంట్స్.. !

Kangana Ranaut: బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మరోసారి కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీని టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ దేశ రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి. సోనియా గాంధీ జీవిత ప్రయాణంపై రాసిన తాజా పుస్తకం ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ మార్కెట్లోకి వచ్చిన నేపథ్యంలో, పాత ఫ్యామిలీ వీడియోలను ప్రస్తావిస్తూ కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గాంధీ కుటుంబంలోకి సోనియా రావడం, ఆ తర్వాత వరుసగా కుటుంబ సభ్యుల మరణాలు సంభవించడం అంతా ఏదో యాదృచ్ఛికం కాదని.. దీని వెనుక చాలా మిస్టరీ దాగుందని ఆరోపించారు.

‘ఎమర్జెన్సీ’ సినిమా రీసెర్చ్ – ఎన్విడియా హనీట్రాప్ వివాదం ప్రస్తావన..

తన 2025 నాటి దర్శకత్వ చిత్రం ‘ఎమర్జెన్సీ’ కోసం తాను ఇండియన్ పాలిటిక్స్, గాంధీ ఫ్యామిలీ హిస్టరీపై లోతైన పరిశోధన చేశానని కంగనా పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఎన్విడియా (Nvidia) హనీట్రాప్ వివాదాన్ని ప్రస్తావిస్తూ పోస్ట్‌ను ప్రారంభించిన ఆమె, సోనియా గాంధీని ఓ ‘రహస్య విదేశీయురాలు’ (Mysterious Foreign National) అని సంబోధించారు.

“ఒక విదేశీ కేఫ్‌లో పెద్ద కొడుకు రాజీవ్ గాంధీని కలిసిన ఓ రహస్య విదేశీ మహిళ గాంధీ కుటుంబంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఇందిరా గాంధీ వారసుడిగా సిద్ధమవుతున్న సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో అనుమానాస్పదంగా చనిపోయారు. ఆ వెంటనే ఆయన భార్య మేనకా గాంధీని ఇంట్లో నుంచి గెంటేశారు. ఆ తర్వాత అత్త ఇందిరా గాంధీ, భర్త రాజీవ్ గాంధీలు ఒకరి తర్వాత ఒకరు దారుణంగా హత్యకు గురయ్యారు. చివరకు ఆ సింహాసనానికి ఏకైక సానుభూతి ఛాయిస్‌గా ఆ విదేశీయురాలే మిగిలింది. ఇవన్నీ కేవలం కాకతాళీయాలు మాత్రమే అంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నాను” అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.

పాత డైనింగ్ టేబుల్ వీడియోపై రియాక్షన్ – మేనకా గాంధీపై సానుభూతి..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇందిరా గాంధీ హయాం నాటి ఓ పాత డైనింగ్ టేబుల్ వీడియోను ఉద్దేశించి కంగనా మాట్లాడారు. ఆ వీడియోలో ఇందిరా గాంధీ, సోనియా, మేనక, చిన్నప్పటి రాహుల్, ప్రియాంక కూర్చుని ఉండగా.. అమేథీ ఉపఎన్నికల్లో రాజీవ్ గాంధీ 2.37 లక్షల ఓట్ల మెజార్టీతో లీడ్‌లో ఉన్నారనే సమాచారం సోనియా అందుకుంటారు. ఆ వీడియో చివరిదాకా చూస్తే మేనకా గాంధీ ఓ గాయపడిన పసిపిల్లలా ఇందిర వైపు చూస్తూ ఉండిపోయారు. కానీ ఇందిర నుంచి కనీస ప్రేమగాని, చిన్న చిరునవ్వుగాని ఆమెకు దక్కలేదు. అదంతా చూస్తుంటే ఎంతో బాధేసింది” అని కంగనా వ్యాఖ్యానించారు.

నిషికాంత్ దూబే కౌంటర్ – సోనియా పుస్తకంపై అభ్యంతరం..

సోనియా గాంధీ తన పుస్తకంలో మేనకా గాంధీ ఇంటి నుంచి వెళ్లిపోవడంపై రాసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే కూడా ఘాటుగా స్పందించారు:

సోనియా తన పుస్తకంలో మేనక గురించి ప్రస్తావిస్తూ.. మొదట్లో అంతా బాగున్నా, రానురాను ఇంట్లో చికాకులు, అసహనం పెరిగాయని రాసుకొచ్చారు.

దీనిపై స్పందించిన దూబే.. మేనకా గాంధీని ఇంటి నుంచి గెంటేస్తున్నప్పుడు సోనియాకు బాధ కలగలేదా అని ప్రశ్నించారు. ఈ పుస్తకం కేవలం తనను తాను గొప్పగా పొగుడుకుంటూ, మిగతా ప్రపంచమంతా చెడ్డదన్నట్లు చిత్రీకరించడానికేనని, ఇది భారతీయ సంస్కృతికి విరుద్ధమని ఆయన విమర్శించారు.

2014 వరకు దశాబ్దాల పాటు సోనియా గాంధీ విదేశీ అజెండాలను దేశంలో నడిపించారని, 2014లో మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఆ ప్రభావం తగ్గిందని కంగనా రనౌత్ తన పోస్ట్‌ను ముగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *